శివుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు అనే పదాలు రూపం లేని ఆ పరంజ్యోతికి లయకారకుడైన మహాదేవుడిలోని వేర్వేరు భక్తి భావాలను తెలియజేస్తాయి. శివుడు అంటే అత్యంత మంగళకరమైనవాడని.. ఈశ్వరుడు అంటే సమస్త విశ్వాన్ని పరిపాలించే సర్వశక్తిమంతుడని.. పరమేశ్వరుడు అంటే దేవతలకు కూడా దేవుడైన మహాదేవుడని ఆథ్యాత్మిక గ్రంధాలు బోధిస్తాయి..
త్రినేత్రుడిగా పిలవబడుతున్న ఆ శ్మశాన నివాసి జీవితం ఎంతో లోతైన తత్వాన్ని తెలియజేస్తుంది. జ్ఞానులు మాత్రమే దర్శించగలిగే అంత నిగూఢమైన సత్యం ఆయన ప్రతి రూపంలోనూ దాగుంది. శరీరానికి బూడిద పూసుకునే దిగంబరుడు... సమస్త బంధాలు, భౌతిక వ్యామోహాలు తాత్కాలికమేనని గుర్తుచేస్తాడు. కాళకూట విషాన్ని గొంతులో దాచిన నీలకంఠుడు... లోక కళ్యాణం కోసం త్యాగానికి ప్రతిరూపంగా నిలుస్తాడు.
మూడో కంటితో అజ్ఞానాన్ని, అహంకారాన్ని దగ్ధం చేసే ఆ కాలకాలుడు... శ్మశానంలో నివసిస్తూ జనన మరణాల చక్రాన్ని దాటించే ముక్తిని ప్రసాదిస్తాడని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి.. ఇక సృష్టి, స్థితి, లయలను తనలో ఇముడ్చుకున్న ఆ ఈశ్వర తత్త్వం మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప సత్యాలను తెలియచేస్తుంది. నుదుటిపై విభూతి, మెడలో నాగాభరణం, జటాజూటంలో గంగ, శిరస్సుపై చంద్రుడు, చేతిలో త్రిశూలం.. శ్మశానమే నివాసంగా భావించే శ్మశానవాసి స్వరూపం ఇవన్నీ లోతైన ఆధ్యాత్మిక సందేశాలను మనకు అందిస్తాయి.
ఇక జీవుడి అంతిమ ప్రయాణం మరణం.. అంతిమ గమ్యం శ్మశానం.. అక్కడ అతను ఒంటరిగా ఉండవలసి వస్తుంది. భార్యాపిల్లలు, చుట్టాలు, ఆస్తులు ఏవి లేని ఆచోట ఆత్మ ఘోష వినడానికి, ఆ జీవుడికి జీవిత తత్త్వాన్ని బోధించడానికి.. పరమేశ్వరుడు శ్మశానంలో ఉంటాడని పండితులు చెబుతారు. ఎందుకంటే ఇక్కడ ఉండాలని ఎవరు కోరుకోరు కదా!.. అలాగే శ్మశానంలో రాజు, పేద, ధనవంతుడు, నిరుపేద అనే భేదాలు ఉండవు.
నిన్నటి వరకు సంపద, హోదా, అధికారం, అందం, పేరు ప్రతిష్ఠలతో జీవించిన మనిషికి ఈ శరీరంతో పాటు.. ఈ లోకంలోని ఏ భౌతిక సంపదా శాశ్వతం కాదు.. చివరికి తన వెంట ఏదీ తీసుకెళ్లలేడు. శ్మశానం మనిషికి చెప్పే గొప్ప సత్యం ఇదే.. శివ తత్త్వం నేర్పేది కూడా ఇదే అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక జీవితంలో ఎంత సంపద వచ్చినా అహంకారం వద్దు, ఎంత అధికారం వచ్చినా దుర్వినియోగం చేయవద్దు, ఎంత కష్టం వచ్చినా ధర్మాన్ని విడిచిపెట్టవద్దని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఎందుకంటే మనిషి వెంట చివరకు వెళ్లేది అతని ఆస్తి కాదు.. అతని హోదా కాదు.. అతను చేసిన కర్మ, అతను నడిచిన ధర్మమార్గమే అని ధర్మ గ్రంధాలు వివరిస్తున్నాయి.. అదేవిధంగా శివుని తత్త్వం మనకు వైరాగ్యాన్ని నేర్పుతుంది.. కానీ బాధ్యతల నుంచి పారిపోవడాన్ని కాదు. సంసారంలో ఉంటూనే మనసులో మమకారాన్ని తగ్గించుకోవడం.. సంపదను అనుభవిస్తూనే దానికి బానిస కాకపోవడం..
విజయాన్ని పొందినా అహంకారం లేకుండా ఉండటం.. అపజయం వచ్చినా కుంగిపోకపోవడం.. ఇదే శివతత్త్వంలోని రహస్యం.. అందుకే శివా.. నాలోని అహంకారాన్ని దహించు.. మోహాన్ని తొలగించు.. ధర్మమార్గంలో నడిపించు.. చివరి శ్వాస వరకు నీ నామస్మరణలో జీవించే భాగ్యాన్ని ప్రసాదించు అని వేడుకోవడమే మనిషి ముందున్న మార్గం అని ఆథ్యాత్మిక పండితులు పేర్కొంటున్నారు..
గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.












