భారీ ఆకస్మిక వరదలతో కకావికలమైన నేపాల్ ప్రభుత్వం తన గత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. సహాయక చర్యల కోసం విదేశీ బలగాలు అవసరం లేదని 24గంటల ముందే స్పష్టం చేసినప్పటికీ, అంతర్జాతీయంగా పెరిగిన దౌత్య ఒత్తిడి కారణంగా తన వైఖరిని సవరించుకుంది. భోటేకోశీ పరివాహక ప్రాంతాల్లో వందలాది మంది విదేశీయులు గల్లంతైన నేపథ్యంలో, సాంకేతిక, ప్రత్యేక నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల బృందాలను మాత్రమే తమ దేశంలోకి అనుమతించేందుకు నేపాల్ సర్కార్ సానుకూలంగా స్పందించింది.
తాజా నివేదికల ప్రకారం.. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 550కి చేరగా, మరో 1,924 మందికి పైగా ఆచూకీ లభించాల్సి ఉంది. ఇందులో 288 మంది భారతీయులతో పాటు చైనా, అమెరికా, ఆస్ట్రేలియా పౌరులు ఉన్నారు. ముఖ్యంగా 216 మెగావాట్ల అప్పర్ త్రిశూలి-1 జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద టన్నెళ్లలో సుమారు 576మంది కార్మికులు చిక్కుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. వరదల ధాటికి రహదారులు ధ్వంసమై, కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ సాధారణ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది.
ఈ అత్యవసర పరిస్థితుల్లో టన్నెల్ రెస్క్యూ, ఫోరెన్సిక్ తనిఖీలు, డీఎన్‌ఏ (DNA) పరీక్షల నిర్వహణ కోసం సాంకేతిక సాయం కోరుతున్నట్లు నేపాల్ విదేశాంగ మంత్రి షిశిర్ ఖనాల్ వెల్లడించారు. భారత్‌తో పాటు చైనా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన రెస్క్యూ నిపుణుల బృందాలకు నేపాల్ విపత్తు నిర్వహణ విభాగం ప్రాథమిక అనుమతులు ఇచ్చింది. ప్రధానంగా రాసువా, నువాకోట్ జిల్లాల్లోని ప్రాజెక్టు సొరంగాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ఈ బృందాలు పనిచేయనున్నాయి.
మరోవైపు, భారత్ వెంటనే స్పందించి సహాయ హస్తాన్ని అందించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ నేపాల్‌తో సంప్రదింపులు జరిపి పూర్తిస్థాయి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. 10టన్నుల అత్యవసర మానవతా సాయం, వైద్యులు, టన్నెల్ రెస్క్యూ స్పెషలిస్టులతో కూడిన 11మంది సభ్యుల ప్రత్యేక బృందం ఇప్పటికే ఖాట్మండుకు చేరుకుంది. మృతదేహాలను వేగంగా గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించే క్రమంలో అంతర్జాతీయ ఫోరెన్సిక్ నిపుణుల సేవలను నేపాల్ వినియోగించుకోనుంది.












