బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన ఛాతీ ఇన్ఫెక్షన్తో (Chest Infection) బాధపడుతున్న 98 ఏళ్ల అద్వానీని శుక్రవారం రాత్రి 7:30 గంటల సమయంలో న్యూఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తి నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శనివారం ఉదయం ఆసుపత్రి వైద్య వర్గాలు వెల్లడించాయి.
పల్మనరీ (శ్వాసకోశ) విభాగానికి చెందిన నిపుణులైన వైద్యబృందం అద్వానీకి వైద్య పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తోంది. వయోభారం కారణంగా నిరంతర వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు ఆస్పత్రి వర్గాలు స్పష్టం చేశాయి. ఆయన ఆస్పత్రిలో చేరిన సమాచారం తెలిసిన వెంటనే పలువురు కేంద్ర మంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
గత మే నెలలోనూ వయోసహజ సమస్యల కారణంగా ఆయన కొన్ని రోజులు ఇదే ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన అద్వానీ, బీజేపీ ఎదుగుదలలో అత్యంత కీలక పాత్ర పోషించారు. అటల్ బిహారీ వాజ్పేయీ ప్రభుత్వంలో 1998 నుంచి 2004 వరకు కేంద్ర హోంశాఖ మంత్రిగా, 2002 నుంచి 2004 వరకు దేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. దేశానికి ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2024లో దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'తో ఆయనను గౌరవించింది. ప్రస్తుతం ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.
పాకిస్తాన్లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించిన లాల్ కృష్ణ అద్వానీ, దేశ విభజన తర్వాత భారత్కు వలస వచ్చారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వారా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టిన ఆయన, జనసంఘ్ పార్టీ ఏర్పాటులోనూ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ (BJP) నిర్మాణంలోనూ కీలక భూమిక పోషించారు. 1990లలో ఆయన చేపట్టిన రామజన్మభూమి రథయాత్ర భారతీయ రాజకీయాల్లో మలుపు తిప్పింది. ఇది బీజేపీని దేశంలో బలమైన శక్తిగా ఎదిగేలా చేసింది. రాజకీయాల్లో అత్యంత నిబద్ధత కలిగిన నేతగా, సిద్ధాంతపరమైన రాజీపడని తత్వానికి ప్రతీకగా అద్వానీ గుర్తింపు పొందారు.


