Rajinikanth-Vijay Devarakonda: జైలర్ 2 వర్సెస్ రణబాలి..ఈ మాట గత వారం పదిరోజుల నుంచి అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో వినిపించిన మాట. ఒక్కరోజు తేడాతో ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డాయి. ఒకరు సూపర్ స్టార్, ఇంకొకరు స్టార్. దసరా హాలీడేస్‌ను టార్గెట్ చేసి బరిలోకి దిగారు. అయితే, రజనీ సినిమాకి పాజిటివ్ టాక్.. విజయ్ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ రావడం ఒకింత షాకింగ్ విషయం.
లాంగ్ రన్లో ఏ సినిమాది పైచేయి అవుతుంది అన్నదే ఇప్పుడు మన టాలీవుడ్ సినీ విశ్లేషకుల్లో ఆసక్తికరంగా జరుగుతున్న చర్చ. మన టాలీవుడ్, అటు కోలీవుడ్ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన రెండు భారీ చిత్రాలు ‘జైలర్ 2’, ‘రణబాలి’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తున్నాయి. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ అక్టోబర్ 15వ తేదీన విడుదల అవగా, విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘రణబాలి’ అక్టోబర్ 16వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో రిలీజైంది.
అయితే, ఈ రెండు చిత్రాలకి మొదటి రోజు వచ్చిన టాక్ ను పరిశీలిస్తే తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రజనీకాంత్ మాస్ ఇమేజ్‌కు ప్రేక్షకుల నుంచి ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ రాగా, ‘రణబాలి’ చిత్రానికి మాత్రం డివైడ్ టాక్ వినిపిస్తోంది. మరి, జైలర్ 2, ‘రణబాలి’ సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటోంది? ఏ సినిమాకి ఎలాంటి ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి? సోషల్ మీడియాలో, ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏంటీ.! అన్న విషయాలను పరిశీలిస్తే విజయ్ సినిమా డిసప్పాయింట్ చేసినట్టుగా అర్థమవుతోంది.
గత కొంతకాలంగా, విజయ్ హిట్ కోసం తహతహలాడుతున్నాడు. రణబాలి సినిమాతోనైనా పాన్ ఇండియా రేంజ్లో హిట్ కొట్టి లెక్క సరిచేద్దామనుకుంటే..ఫలితం తేడాగా వినిపిస్తోంది. 120 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి రికవరీ చాలా కష్టం అంటున్నారు. ఇటీవల ఇరుముడి సినిమాతో వచ్చిన లాభాలు..రణబాలితో మైనస్ అవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ, జైలర్ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన జైలర్ 2 మాత్రం ఫస్ట్ హాఫ్ కామెడీతో సెకండ్ హాఫ్ యాక్షన్ అండ్ ఎమోషన్స్‌తో నడిపించి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకి సాలీడ్ హిట్ ఇచ్చాడని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. మొత్తానికి, ఈ దసరాకి విన్నర్ సూపర్ స్టారే అని అర్థమవుతోంది.


