నెలరోజులుగా కానరాని ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
పండుగ వేళ పర్యాటకులకు తీవ్ర నిరాశ
హెచ్ఎండీఏ నుంచి పర్యాటక శాఖకు మారిన నిర్వహణ బాధ్యతలు
రూ.13కోట్ల విలువ గల బస్సులు.. షెడ్డుకే పరిమితం
హైదరాబాద్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు గత నెల రోజులుగా పూర్తిగా నిలిచిపోయాయి. బతుకమ్మ, దసరా పండుగ సెలవుల నేపథ్యంలో నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను తిలక్షించేందుకు వస్తున్న సందర్శకులకు ఈ పరిణామం తీవ్ర నిరాశను కలిగిస్తోంది. హెచ్ఎండీఏ (HMDA) నుంచి ఈ బస్సుల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న రాష్ట్ర పర్యాటక శాఖ (Tourism Department).. వాటిని రోడ్డెక్కించడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో హెచ్ఎండీఏ సుమారు రూ.13కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు ట్యాంక్బండ్, అసెంబ్లీ, చార్మినార్ వంటి ప్రధాన మార్గాల్లో విజయవంతంగా నడిపారు. అయితే నిర్వహణను హెచ్ఎండీఏ నుంచి పర్యాటక శాఖకు బదిలీ చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 నుంచే సర్వీసులు పునఃప్రారంభిస్తామని చెప్పిన అధికారులు.. నెల రోజులు గడుస్తున్నా వాటిని ప్రారంభించలేదు. ప్రస్తుతం ఈ బస్సులన్నీ సంజీవయ్య పార్కులోని ప్రత్యేక షెడ్కే పరిమితమయ్యాయి.
ప్రత్యామ్నాయ మార్గంలేక ఆర్థిక భారం
హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇతర వాహనాల రాకపోకలపై నియంత్రణ ఉండటం, డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులో లేకపోవడంతో పర్యాటకులు ప్రత్యామ్నాయంగా ఆటోలు, క్యాబ్లను ఆశ్రయించాల్సి వస్తోంది. దీనివల్ల వారిపై తీవ్రమైన ఆర్థిక భారం పడుతోంది. సచివాలయం నుంచి సంజీవయ్య పార్కు వెళ్లడానికే రూ.400 నుంచి రూ.600 వరకు ఖర్చు చేయాల్సి వస్తోందని పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి డబుల్ డెక్కర్ బస్సులను తక్షణమే పునఃప్రారంభించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.


