ప్రపంచం

ఆకాశంలో ఇంటర్నెట్ వార్..! స్టార్‌లింక్‌ వర్సెస్ అమెజాన్.. భారత్ మార్కెట్ ఎవ‌రిది..?

రచన: Kashi9 నిమిషాల పఠనం

ప్రస్తుతం స్టార్‌లింక్ దూకుడుగా ముందుకెళ్తోంది. అమెజాన్ వేగంగా తన ఉపగ్రహాల సంఖ్యను పెంచుతోంది. భారత్‌లో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తమ బలమైన నెట్‌వర్క్, కస్టమర్ బేస్‌తో ఈ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మరోవైపు OneWeb వంటి సంస్థలు కూడా భారత శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్‌లో ఉన్నాయి.

ఇక శాటిలైట్ నుంచే ఇంట‌ర్నెట్

శ‌ర‌వేగంగా మారుతున్న టెక్నాల‌జీ

స్టార్‌లింక్, అమెజాన్ మ‌ధ్య పోటీ

భారత్‌లో జియో, ఎయిర్‌టెల్ దూకుడు

ఇప్పటివరకు ఇంటర్నెట్ అంటే మొబైల్ టవర్, ఫైబర్ కేబుల్, వైఫై రూటర్.. ఇవే మనకు తెలుసు. కానీ ఇకపై ఈ లెక్క మారబోతోంది. ఆకాశంలో తిరిగే ఉపగ్రహాల నుంచే నేరుగా ఇంటర్నెట్ మన ఇళ్లకు వచ్చే రోజులు దగ్గరపడుతున్నాయి. ఇందుకోసం ప్రపంచంలోని దిగ్గజ టెక్ కంపెనీలు భారీ రేసులోకి దిగాయి. ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ ఒకవైపు.. అమెజాన్‌కు చెందిన Amazon Leo మరోవైపు.. భారత్‌లో జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజాలు ఇంకోవైపు. దీంతో శాటిలైట్ ఇంటర్నెట్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ మాత్రమే కాదు.. భారీ బిజినెస్ వార్‌గా మారుతోంది.

టవర్ లేకుండానే ఇంటర్నెట్.. ఎలా?

సింపుల్‌గా చెప్పాలంటే.. భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో చిన్న చిన్న ఉపగ్రహాలను పెద్ద సంఖ్యలో ఉంచుతారు. వీటినే లో ఎర్త్ ఆర్బిట్ లేదా LEO శాటిలైట్స్ అంటారు. భూమిపై ఉన్న యాంటెన్నా లేదా టెర్మినల్‌కి ఈ ఉపగ్రహాలు సిగ్నల్ పంపిస్తాయి. అక్కడి నుంచి ఇంటర్నెట్ నెట్‌వర్క్‌కు కనెక్షన్ వస్తుంది.

దీంతో ఫైబర్ కేబుల్ వేయడం కష్టమైన ప్రాంతాలు, మొబైల్ టవర్లు ఏర్పాటు చేయడానికి ఖర్చు ఎక్కువయ్యే కొండలు, అడవులు, దీవులు, సరిహద్దు ప్రాంతాలు కూడా ఇంటర్నెట్ పరిధిలోకి రావచ్చు. అందుకే శాటిలైట్ ఇంటర్నెట్‌ను కేవలం నగరాల కోసం కాకుండా డిజిటల్ డివైడ్‌ను తగ్గించే టెక్నాలజీగా కూడా చూస్తున్నారు.

మస్క్ వ‌ర్సెస్ అమెజాన్

ఈ రేసులో ఇప్పటివరకు అత్యంత ముందున్న పేరు స్టార్‌లింక్. స్పేస్‌ఎక్స్ వేలాది LEO ఉపగ్రహాలను ఇప్పటికే కక్ష్యలోకి పంపింది. ఇప్పుడు భారత్‌లో సేవలు అందించేందుకు కూడా స్టార్‌లింక్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తాజాగా రెండో తరం ఉపగ్రహాల వ్యవస్థకు భారత అనుమతుల కోసం మరోసారి దరఖాస్తు చేసుకోవడం కూడా ఆ కంపెనీ భారత్‌పై ఎంత ఫోకస్ పెట్టిందో చూపిస్తోంది. ఈ కొత్త వ్యవస్థలో డైర‌క్ట్ టు డివైజ్ టెక్నాలజీ కూడా ఉంది. అంటే భవిష్యత్తులో ప్రత్యేక టెర్మినల్ అవసరం లేకుండానే నేరుగా మొబైల్ పరికరాలకు శాటిలైట్ కనెక్టివిటీ అందించే అవకాశం ఉంటుంది.

మరోవైపు అమెజాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. గతంలో Project Kuiperగా పిలిచిన శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ ఇప్పుడు అమేజాన్ లియోగా మారింది. 3,000కు పైగా LEO ఉపగ్రహాలతో గ్లోబల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2026 జూలై నాటికి దాదాపు 400 ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదిలోనే ప్రారంభ సేవలను అందించాలని అమెజాన్ లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్‌లో అసలు గేమ్ మొదలైంది!

ఇక్కడే ఈ కథ మరింత ఆసక్తికరంగా మారుతోంది. భారత్‌లో కేవలం విదేశీ కంపెనీలే పోటీ పడటం లేదు. మన దేశానికి చెందిన టెలికాం దిగ్గజాలు కూడా ఈ రేసులో కీలకంగా ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్, స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యం చేసుకుని స్టార్‌లింక్ సేవలను భారత వినియోగదారులకు అందించే దిశగా అడుగులు వేసింది. రిలయన్స్ జియో కూడా స్పేస్‌ఎక్స్‌తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. అంటే ఒకవైపు స్టార్‌లింక్ తన టెక్నాలజీని తీసుకొస్తుంటే.. మరోవైపు భారత్‌లోని భారీ కస్టమర్ బేస్‌ను జియో, ఎయిర్‌టెల్ క్యాష్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

ఇక అమెజాన్ కూడా భారత్‌ను కీలక మార్కెట్‌గా చూస్తోంది. 2026లోనే భారత్‌లోకి విస్తరించే ప్రయత్నాలను వేగవంతం చేస్తోంది. దీంతో భవిష్యత్తులో స్టార్‌లింక్-జియో-ఎయిర్‌టెల్ ఒక వైపు.. అమెజాన్ మరో వైపు అనేలా పోటీ కనిపించే అవకాశం ఉంది.

గ్రామాలకు ఇది గేమ్‌చేంజరా?

భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్‌కు అతిపెద్ద అవకాశం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోనే ఉంది. ఇప్పటికీ ఫైబర్ కనెక్షన్ తీసుకెళ్లడం లేదా టవర్ ఏర్పాటు చేయడం కష్టమైన ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ శాటిలైట్ కనెక్టివిటీ ఉపయోగపడొచ్చు.

పాఠశాలలు, ఆసుపత్రులు, చిన్న వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, దూర ప్రాంతాల్లో పనిచేసే సంస్థలకు ఇది ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు భూసంబంధిత కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతిన్నా.. శాటిలైట్ ఆధారిత కనెక్టివిటీ ప్రత్యామ్నాయంగా ప‌ని చేస్తుంది.

అయితే దీనికి ఒక పరిమితి ఉంది. శాటిలైట్ ఇంటర్నెట్ అంటే అందరికీ చౌకైన ఇంటర్నెట్ అని ఇప్పుడే చెప్పలేం. టెర్మినల్ ఖర్చు, నెలవారీ చార్జీలు, స్పెక్ట్రమ్, ప్రభుత్వ అనుమతులు, భద్రతా నిబంధనలు వంటి అంశాలు కీలకం.

ఫోన్‌కే నేరుగా శాటిలైట్ సిగ్నల్ వస్తే?

ఇదే ఈ రేసులో తదుపరి పెద్ద అడుగు. ప్రత్యేక డిష్ లేదా టెర్మినల్ అవసరం లేకుండా నేరుగా మొబైల్ ఫోన్‌కు శాటిలైట్ నుంచి కనెక్టివిటీ అందించే డైర‌క్ట్ టు డివైజ్ టెక్నాలజీపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. స్టార్‌లింక్ కూడా భారత్‌లో తన తదుపరి తరం వ్యవస్థలో ఈ టెక్నాలజీని ప్రతిపాదిస్తోంది.

అది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. మొబైల్ టవర్ కనిపించని ప్రాంతంలో కూడా మెసేజ్, డేటా వంటి సేవలు అందుకునే అవకాశం ఉంటుంది. అంటే ఆకాశమే కొత్త టవర్‌గా మారే పరిస్థితి రావచ్చు.

అసలు గెలిచేది ఎవరు?

ప్రస్తుతం స్టార్‌లింక్ దూకుడుగా ముందుకెళ్తోంది. అమెజాన్ వేగంగా తన ఉపగ్రహాల సంఖ్యను పెంచుతోంది. భారత్‌లో జియో, ఎయిర్‌టెల్ వంటి సంస్థలు తమ బలమైన నెట్‌వర్క్, కస్టమర్ బేస్‌తో ఈ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. మరోవైపు OneWeb వంటి సంస్థలు కూడా భారత శాటిలైట్ కమ్యూనికేషన్ మార్కెట్‌లో ఉన్నాయి.

అందుకే ఇది కేవలం మస్క్ వర్సెస్ బెజోస్ పోటీ కాదు. ఇది భవిష్యత్తులో ఇంటర్నెట్ ఎవరి చేతిలో ఉంటుందన్న పోటీ. భూమిపై టవర్లు, కేబుళ్లతో మొదలైన ఇంటర్నెట్ యుద్ధం ఇప్పుడు ఆకాశంలోకి వెళ్లింది.

#Satellite Internet#Starlink#Amazon Leo#Jio#Airtel#SpaceX#Satellite Connectivity#Internet War#Telecom India#LEO Satellites#Direct to Device#India Technology#Space Technology#Broadband
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి