డీలిమిటేషన్‌పై మారుతున్న సమీకరణాలు
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ఛాన్స్..!
ప్రధాని మోదీకి ఖర్గే లేఖ
అన్ని పార్టీలతో చర్చించాలని డిమాండ్
డీలిమిటేషన్ అంశం మరోసారి దేశ రాజకీయాల్లో హీట్ పెంచుతోంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం కీలక అడుగులు వేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో.. కాంగ్రెస్ మరోసారి అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ.. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్ అంశంపై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించాలని కోరారు. అంతేకాదు.. ప్రతిపాదనలను ముందుగానే పార్టీలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు అందించి వాటిని అధ్యయనం చేసేందుకు తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేంద్రం నిజంగానే డీలిమిటేషన్ బిల్లును మళ్లీ ముందుకు తీసుకెళ్లబోతోందా? ఖర్గే తాజా లేఖకు కారణం కూడా ఇదే. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఇటీవల మరోసారి పార్లమెంట్ సమావేశం జరిగే అవకాశం ఉందంటూ సంకేతాలు ఇవ్వడంతో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అంశాలపై కేంద్రం తదుపరి అడుగు ఏమిటన్న చర్చ మొదలైంది. అయితే ప్రత్యేక సమావేశంపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు.
అసలు వివాదం ఏంటి?
డీలిమిటేషన్ అంటే జనాభా ప్రాతిపదికన పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల హద్దులను, అవసరమైతే వాటి సంఖ్యను పునర్వ్యవస్థీకరించడం. ప్రస్తుతం ఉన్న రాజ్యాంగ నిబంధనల ప్రకారం 2026 తర్వాత జరిగే మొదటి జనగణన అనంతరం నియోజకవర్గాల పునర్విభజనకు అవకాశం ఉంది.
అయితే ఈసారి వివాదం కేవలం నియోజకవర్గాల సరిహద్దులకే పరిమితం కాలేదు. లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం ఎంత ఉండాలి? అన్నది అసలు రాజకీయ ప్రశ్నగా మారింది.
2026లో కేంద్రం ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, రాజ్యాంగ సవరణ బిల్లుతో కలిపి లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే ప్రతిపాదన ముందుకు వచ్చింది. కేంద్రం వివరాల ప్రకారం 543 స్థానాల నుంచి మొత్తం సంఖ్య సుమారు 816కు పెరగొచ్చని చర్చ జరిగింది. అదే సమయంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలుకు మార్గం సుగమం చేయడం కూడా ఈ ప్రక్రియతో అనుసంధానమైంది.
దక్షిణాది రాష్ట్రాల భయం ఎందుకు?
డీలిమిటేషన్ చర్చలో అత్యంత సున్నితమైన అంశం ఇదే. జనాభాను ప్రధాన ప్రమాణంగా తీసుకుని సీట్లను పునర్విభజిస్తే.. గతంలో జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయంగా నష్టం జరుగుతుందన్న ఆందోళన చాలా కాలంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ అంశంపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా.. జనాభాను నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించినట్టుగా ఎందుకు సీట్లు తగ్గాలి? అన్న ప్రశ్న దక్షిణాది రాజకీయ పార్టీల నుంచి వస్తోంది.
అయితే కేంద్రం మాత్రం ఈ వాదనను ఖండిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పట్లో పార్లమెంట్‌లో స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రస్తుత లెక్కల ప్రకారం దక్షిణ భారతదేశానికి ఉన్న 129 లోక్‌సభ స్థానాలు ప్రతిపాదిత మార్పుల తర్వాత 195కు పెరగొచ్చని కేంద్రం చెబుతోంది. అంటే దక్షిణాది రాష్ట్రాలకు మొత్తం సీట్ల సంఖ్య తగ్గదని, వాటి వాటా దాదాపు స్థిరంగానే ఉంటుందని ప్రభుత్వం వాదిస్తోంది.
తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి..?
తెలంగాణకు ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాలున్నాయి. కేంద్రం పార్లమెంట్‌లో వివరించిన ఒక నమూనా ప్రకారం.. కొత్త వ్యవస్థలో ఈ సంఖ్య 26కు పెరగొచ్చని అంచనా వేసింది. అంటే తెలంగాణ సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నది కేంద్రం వాదన.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం 25 లోక్‌సభ స్థానాలు ఉండగా.. అదే నమూనాలో 38కి పెరిగే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. కర్ణాటకకు 28 నుంచి 42, తమిళనాడుకు 39 నుంచి 59, కేరళకు 20 నుంచి 30 స్థానాలు పెరగవచ్చని కేంద్రం వివరించింది.
అయితే ఇక్కడ మరో లెక్క ఉంది. సీట్ల సంఖ్య పెరగడం ఒక విషయం.. మొత్తం లోక్‌సభలో ఆ రాష్ట్రం వాటా ఎంత పెరుగుతుంది అనేది మరో విషయం. దక్షిణాది రాష్ట్రాల ఆందోళన ప్రధానంగా ఈ రెండో అంశంపైనే ఉంది.
అఖిలపక్ష సమావేశం ఎందుకు కోరుతున్నారు?
ఇది కేవలం బిల్లును వ్యతిరేకించడం కోసం మాత్రమే కాదని కాంగ్రెస్ చెబుతోంది. ప్రతిపాదిత మార్పులు దేశ రాజకీయ వ్యవస్థపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయని.. అందుకే ముందుగా అన్ని పార్టీలతో చర్చించాలని ఖర్గే కోరుతున్నారు.
అసలు కాంగ్రెస్‌కు ఉన్న ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల సంఖ్యను మరికొంత కాలం కొనసాగించడం. తాజా లేఖలో ఖర్గే.. లోక్‌సభ ప్రస్తుత బలాన్ని మరో 25 ఏళ్ల పాటు కొనసాగించాలన్న ప్రతిపాదనను కూడా ముందుకు తెచ్చారు. మహిళా రిజర్వేషన్‌ను 2029 నుంచే అమలు చేయాలని, కానీ దానిని సీట్ల పెంపుతో ముడిపెట్టకూడదన్నది కాంగ్రెస్ వైఖరిగా కనిపిస్తోంది.
కేంద్రానికి ఎందుకు కీలకం?
డీలిమిటేషన్ కేవలం ఒక బిల్లు కాదు. ఇది వచ్చే దశాబ్దాల భారత రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉన్న అంశం. ఒకవైపు మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలంటే నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అవసరం అన్న వాదన ఉంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం, జనాభా నియంత్రణకు ఇచ్చిన ప్రాధాన్యం దెబ్బతినకూడదని కోరుతున్నాయి.
అందుకే కేంద్రం ముందుకు వెళ్లాలంటే బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాత్రమే కాకుండా దక్షిణాది రాష్ట్రాల పార్టీలతోనూ ఒక అవగాహన అవసరం. ఇప్పటికే తమిళనాడులో డీలిమిటేషన్‌పై రాజకీయ వ్యతిరేకత తీవ్రంగా కనిపిస్తోంది.
అందరి చూపు ఢిల్లీ వైపే..
ప్రస్తుతం అధికారికంగా కొత్త అఖిలపక్ష సమావేశం తేదీని ఖరారు చేయలేదు. కానీ కేంద్రం ప్రతిపక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆగస్టు ప్రారంభంలో కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ మధ్య చర్చలు కూడా డీలిమిటేషన్ బిల్లుపైనే జరిగాయి. రాహుల్ గాంధీ మాత్రం ముందుగా అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని వివరాలను పార్టీలకు చెప్పాలని పట్టుబట్టారు.
ఇప్పుడు ఖర్గే తాజా లేఖతో ఈ డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్‌ను మరోసారి సమావేశపరిచే అవకాశం ఉందన్న రిజిజు వ్యాఖ్యలు కూడా ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చాయి.
అంటే.. డీలిమిటేషన్‌పై అసలు పోరు మొదలైనట్టే. కేంద్రం చెబుతున్న లెక్కలు ఒకలా ఉంటే.. ప్రతిపక్షం, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు చూస్తున్న రాజకీయ లెక్కలు మరోలా ఉన్నాయి. ఇక ముందు జరగబోయే అఖిలపక్ష చర్చలు ఈ వివాదానికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డీలిమిటేషన్‌లో గీసే గీతలు కేవలం నియోజకవర్గాల సరిహద్దులను మాత్రమే మార్చవు.. భారత రాజకీయాలను సమూలంగా మార్చే అవకాశం ఉంది.












