National

కేంద్రంపై RSS సీరియ‌స్..!

రచన: Kashi8 నిమిషాల పఠనం

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న నిర‌స‌న‌ల‌ను సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌స్తావించారు జోషీ. సోమ‌వారం నాడు ఛ‌లో పార్ల‌మెంటు సంద‌ర్భంగా పోలీసులు అనుస‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టారు. అమ్మాయిల ప‌ట్ల పోలీసులు అత్యంత హేయంగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ప్ర‌ధానిపై RSS గుర్రుగా ఉందా..?

ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషీ వ్యాఖ్య‌ల వెనుక‌ అర్థ‌మేంటి..?

సీనియ‌ర్ నేత కామెంట్స్‌తో పార్టీలో క‌ల‌క‌లం

బీజేపీలో ఏం జ‌రుగుతోంది..?

RSS తో బీజేపీకి ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. RSS ను కాద‌ని బీజేపీ ఎలాంటి కీల‌క నిర్ణ‌యం తీసుకోదు. ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ బీజేపీలో అత్యంత బ‌ల‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఇది ఎవ‌రూ కాద‌న‌లేని స‌త్యం. అయినా కూడా ఆరెస్సెస్‌ను పార్టీ అనుస‌రిస్తూనే ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాతృ సంస్థగా, సైద్ధాంతిక మార్గదర్శిగా ఉంటుంది. ఇది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. ఐతే తాజాగా జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాలు బీజేపీ, ఆరెస్సెస్ మ‌ధ్య విభేదాల‌కు కార‌ణంగా మారుతున్నాయ‌నే ప్రచారం జ‌రుగుతోంది. సోష‌ల్ మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియాలోనూ ఇలాంటి వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాని మోదీతో పాటు, బీజేపీ హైక‌మాండ్‌పైనా ఆరెస్సెస్ గుర్రుగా ఉంద‌ట. అస‌లు ఈ విభేదాలకు కార‌ణాలేంటి..?

ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ వ్యాఖ్య‌ల‌తో క‌ల‌క‌లం

ముర‌ళీమ‌నోహ‌ర్ జోషీ బీజేపీలో అత్యంత సీనియ‌ర్ నాయకుడు. కీల‌క‌మైన స‌మ‌యంలో పార్టీకి అధ్య‌క్షుడిగా సేవ‌లందించారు. పార్టీ బ‌లోపేతానికి కృషి చేసిన వాజ్‌పేయ్, అద్వానీలతో స‌మాన‌మైన ఇమేజ్ ఉన్న లీడ‌ర్. కేంద్రంలో మంత్రిగా ప‌ని చేసిన అనుభవం కూడా ఉంది. అలాంటి సీనియ‌ర్ నేత చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. ప్ర‌ధానంగా బీజేపీలో పెద్ద చ‌ర్చ‌నే లేవ‌నెత్తాయి.

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేస్తున్న నిర‌స‌న‌ల‌ను సోషల్ మీడియా వేదిక‌గా ప్ర‌స్తావించారు జోషీ. సోమ‌వారం నాడు ఛ‌లో పార్ల‌మెంటు సంద‌ర్భంగా పోలీసులు అనుస‌రించిన తీరును త‌ప్పుబ‌ట్టారు. అమ్మాయిల ప‌ట్ల పోలీసులు అత్యంత హేయంగా ప్ర‌వ‌ర్తించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యార్థుల డిమాండ్లలో న్యాయం ఉందని ఆయన స్పష్టం చేశారు. దీనిని బలప్రయోగం ద్వారా అణచివేయరని తాను భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు. ప‌రోక్షంగా కేంద్రానికి చుర‌క‌లంటించారు. ఇటువంటి చర్యలు వికసిత్ భారత్ లక్ష్యానికి అనేక వర్గాలను దూరం చేస్తుందని కాస్త ఘాటుగానే పోస్ట్ చేశారు.

జోషీ చేసిన ఈ పోస్ట్ పార్టీలో తీవ్ర క‌ల‌క‌లానికి దారి తీసింది. నేడు పార్టీ ఈ స్థాయిలో ఉందంటే అందుకు కార‌కుల్లో ఎంఎం జోషీ ఒక‌రు. ప్ర‌స్తుతం ఆయ‌న క్రియాశీల‌క రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నా... ఆయ‌న ప్రాధాన్య‌త‌ను ఎవ‌రూ కాద‌న‌లేరు. పైగా ఆరెస్సెస్‌తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ముర‌ళీ మ‌నోహర్ జోషీ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆరెస్సెస్ వ్యాఖ్య‌లుగానే కొంద‌రు భావిస్తున్నారు.

ఒక్క‌రి కోసం ఇంత అవ‌స‌ర‌మా..?

కేంద్ర‌మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేసే దాకా జంత‌ర్ మంత‌ర్ నుంచి క‌దిలేదే లేద‌ని సీజేపీ స్ప‌ష్టం చేస్తోంది. కేంద్రం మాత్రం ఆ ఒక్క‌టీ త‌ప్ప.. అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ నేప‌థ్యంలో దేశంలోని కొన్ని వ‌ర్గాల్లో బీజేపీపై వ్య‌తిరేక‌త పెరుగుతోంద‌ని ఆరెస్సెస్ భావిస్తోంద‌ట‌. ఒక్క‌రి కోసం ఇంత ర‌చ్చ అవ‌స‌ర‌మా అని నాగ్‌పూర్ వేదిక‌గా చ‌ర్చ జ‌రుగుతున్న‌ట్టు స‌మాచారం.

వ‌ర్షాకాల స‌మావేశాల్లో డీలిమిటేష‌న్, మహిళా రిజ‌ర్వేష‌న్ బిల్లులు పాస్ చేయిస్తార‌ని తాము ఎదురుచూస్తుంటే.. ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్‌ను కాపాడుకునేందుకే కేంద్రం ప్ర‌య‌త్నిస్తోంద‌ని ఆరెస్సెస్ గుర్రుగా ఉంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు పార్ల‌మెంటు సెష‌న్స్ ఒక్క‌రోజు కూడా స‌క్ర‌మంగా సాగ‌క‌పోవ‌డంపై ఆరెస్సెస్ ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి.

మోదీపై గుర్రుగా RSS

ఏదైనా విష‌యంలో ఆరెస్సెస్ ఆగ్ర‌హంగా ఉందంటే.. బీజేపీ వెన‌క్కి త‌గ్గాల్సిందే. అంత ప‌వ‌ర్‌ఫుల్ రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్. ఐతే ప్ర‌స్తుతం ప్ర‌ధాని మోదీ అంత‌కంటే ప‌వ‌ర్‌ఫుల్. అయినా కూడా త‌న మ‌న‌సులోని మాట చెప్ప‌కుండా ఉండలేక‌పోతోంద‌ట ఆరెస్సెస్. ఈ స‌మ‌స్య‌ను వెంట‌నే ప‌రిష్క‌రించుకోవాల‌ని కోరింద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. యూపీ, పంజాబ్, గుజ‌రాత్ లాంటి కీల‌క రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ఎంతో స‌మ‌యం లేద‌ని, ఇలాంటి స‌మ‌యంలో యువ‌త‌ను దూరం చేసుకోవ‌ద్ద‌ని బీజేపీ పెద్ద‌ల‌కు ఆరెస్సెస్ మార్గ‌నిర్దేశం చేసిన‌ట్టు తెలుస్తోంది. ఈ వార్త‌ల నేప‌థ్యంలో కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా విష‌యంలో బీజేపీ ఏ నిర్ణ‌యం తీసుకుంటుందా అనే ఆస‌క్తి నెల‌కొంది.

#RSS vs Modi#Murli Manohar Joshi#BJP RSS relations#Narendra Modi#Dharmendra Pradhan#BJP internal politics
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి