క్రీడలు

పోలియోను జయించి.. పేదరికాన్ని దాటి.. కూరగాయల వ్యాపారి కొడుకు అద్భుతం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఆత్మవిశ్వాసం ముందు శారీరక వైకల్యం తలవంచాల్సిందేనని, పట్టుదల ఉంటే పేదరికం విజయాన్ని ఆపలేదని మరో యువకుడు నిరూపించారు. పుట్టుకతోనే పోలియో సోకినా అధైర్యపడకుండా, జీవనోపాధి కోసం ఈ-రిక్షా నడుపుతూనే అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేశాడు.

ఆత్మవిశ్వాసం ముందు శారీరక వైకల్యం తలవంచాల్సిందేనని, పట్టుదల ఉంటే పేదరికం విజయాన్ని ఆపలేదని మరో యువకుడు నిరూపించారు. పుట్టుకతోనే పోలియో సోకినా అధైర్యపడకుండా, జీవనోపాధి కోసం ఈ-రిక్షా నడుపుతూనే అంతర్జాతీయ క్రీడా వేదికపై దేశ పతాకాన్ని ఎగురవేశాడు. 2026 కామన్వెల్త్ క్రీడల్లో పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో కాంస్య పతకం సాధించి, భారత్‌కు తొలి మెడల్ అందించిన ఘనతతో సరికొత్త చరిత్ర సృష్టించారు. బిహార్‌కు చెందిన నిరుపేద కూరగాయల వ్యాపారి కుమారుడు జండు కుమార్ కథ ఇది.

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పారా పవర్‌లిఫ్టింగ్ పురుషుల హెవీవెయిట్ విభాగంలో అద్భుత ప్రదర్శన చేసిన జండు కుమార్ కాంస్య పతకాన్ని సాధించి దేశానికి తొలి విజయాన్ని అందించాడు. నిన్న రాత్రి జరిగిన హోరాహోరీ పోరులో 72.4కిలోల విభాగంలో పోటీపడిన ఆయన, తన రెండో ప్రయత్నంలో 190 కిలోల బరువును విజయవంతంగా ఎత్తి మూడో స్థానంలో నిలిచారు. జండు కుమార్ సాధించిన ఈ విజయం వెనుక ఎంతో కష్టమైన సుదీర్ఘ పోరాటం ఉంది.

బిహార్‌లోని నలందా జిల్లా హర్నాత్ గ్రామానికి చెందిన ఆయన, ఒక నిరుపేద కూరగాయల వ్యాపారి కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే పోలియో బారిన పడి వైకల్యాన్ని ఎదుర్కొన్నప్పటికీ, ఏనాడూ తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఆరంభంలో షాట్‌పుట్, డిస్కస్ త్రో వంటి క్రీడలలో రాణించిన ఆయన, ఆ తర్వాత జిమ్ సాధనలో పవర్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుని ఆ దిశగా అడుగులు వేశారు.

కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు వీధి వ్యాపారం చేయడంతో పాటు ఈ-రిక్షా నడుపుతూ జీవనం సాగించిన జండుకు ఆర్థిక ఇబ్బందులు నిరంతరం సవాలుగా మారాయి. కనీస వసతులు లేకున్నా, క్రీడల పట్ల ఉన్న మక్కువతో కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించి శిక్షణ పొందేవాడు. ఈ కష్ట సమయంలో పారాలింపిక్ పతక విజేత, ప్రముఖ కోచ్ రాజిందర్ సింగ్ ఆయనలోని ప్రతిభను గుర్తించి గాంధీనగర్‌లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

రాజిందర్ సింగ్ మార్గదర్శకత్వంలో జండు కుమార్ క్రీడా ప్రయాణంలో వేగం పుంజుకుంది. 2025 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 205 కిలోల బరువు ఎత్తి జాతీయ రికార్డు సృష్టించగా, ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో 206 కిలోలు ఎత్తి తన సొంత రికార్డును తానే తిరగరాశాడు. ఇప్పటికే బీజింగ్ ప్రపంచకప్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలు గెలుచుకున్న ఆయన, ఇప్పుడు కామన్వెల్త్ వేదికపై కాంస్యం సాధించి నిరుపేదల ఆశయాలకు ప్రతీకగా నిలిచాడు.

#Jandu Kumar#Commonwealth Games 2026#Para Powerlifting#India First Medal#Sports News Telugu#Bihar News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి