ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమర్‌నాథ్ మంచు లింగ దర్శన యాత్ర నేటి నుంచి తిరిగి ప్రారంభమైంది. జమ్ములోని భగవతినగర్ బేస్ క్యాంప్ నుంచి భక్తుల తొలి విడత ప్రయాణం ఉత్సాహంగా మొదలైంది. ప్రతికూల వాతావరణం, భద్రతా కారణాల దృష్ట్యా తాత్కాలికంగా నిలిచిపోయిన ఈ పవిత్ర యాత్ర పునఃప్రారంభం కావడంతో శివభక్తుల్లో ఆనందం నిండింది. యాత్రలో భాగంగా మొదటి విడతలో దాదాపు 5వేల మంది భక్తులు జమ్ము బేస్ క్యాంప్ నుంచి బాల్తాల్ బేస్ క్యాంప్‌కు బయల్దేరారు.
ప్రత్యేక వాహనాలు, కట్టుదిట్టమైన భద్రత నడుమ యాత్రికులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ నుంచి భక్తులు కాలినడకన లేదా గుర్రాలపై కొండలపైకి చేరుకుని స్వామివారిని దర్శించుకోనున్నారు. భక్తుల రక్షణ, సౌకర్యార్థం అధికారులు నగరవ్యాప్తంగా, యాత్రా మార్గంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వైద్య సాయం, తాగునీరు, తాత్కాలిక నివాస సదుపాయాలు, ఆహార పంపిణీ కేంద్రాలను మార్గమధ్యంలో సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహాయక బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు "హర్ హర్ మహాదేవ్" శంఖారావాల మధ్య భక్తిశ్రద్ధలతో పయణమవుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే రాబోయే రోజుల్లో యాత్రికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు. ఈ పవిత్ర అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయే సమయానికి, దేశ నలుమూలల నుంచి సుమారు 4.5లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
వర్షాలు, ప్రతికూల వాతావరణం, కొండచరియలు విరిగిపడటం వల్ల అమర్‌నాథ్ యాత్రను మొత్తం 6 రోజుల పాటు (జూలై 19 నుండి జూలై 24 వరకు) నిలిపివేశారు. యాత్ర హఠాత్తుగా ఆగడంతో వేలాది మంది యాత్రికులు జమ్ములోని భగవతినగర్, బాల్తాల్, పహల్గామ్ బేస్ క్యాంపులలోనే నిలిచిపోయారు. జమ్ము-శ్రీనగర్ జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడి వాహనాల్లో ఉన్న భక్తులు మార్గమధ్యంలోనే చిక్కుకుపోయారు.












