NTA Restructure: నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. జంతర్ మంతర్ వేదికగా కొన్ని రోజులుగా యువత ఆందోళన బాట పట్టింది. పరీక్షల నిర్వహణలో తరుచుగా చోటు చేసుకుంటున్న వ్యవస్థాగత వైఫల్యాలపై విద్యార్థి లోకం మండిపడుతోంది. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజీ నివారణకు చర్యలు చేపట్టింది.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో భారీ ప్రక్షాళన చేసింది కేంద్రం. ఎన్టీఏ నుంచి ఏకంగా 47 మందిని సర్వీస్ నుంచి తొలగించింది. ప్రశ్నాపత్రాల లీకేజీ వివాదానికి కారణమైన వారిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు ఆ 47 మందిపై లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. 47 మంది తొలగింపును ఎన్టీఏ ప్రక్షాళనలో తొలి అడుగుగా అధికారులు అభివర్ణించారు.
ప్రశ్నా పత్రాల లీకేజీ నివారణ కోసం ఆగస్టులో ఎన్టీఏ మొత్తం వ్యవస్థను పునర్ నిర్మించాలని కేంద్రం భావిస్తోంది. లీకులకు అవకాశం లేకుండా నిపుణుల కమిటీ సిఫార్సుల ఆధారంగా సంస్కరణలు అమలు చేయాలని, ఏజెన్సీ ఔట్ సోర్సింగ్ ప్రక్రియను కూడా మార్చాలని కేంద్రం నిర్ణయించింది. కాగా, జేఈఈ, నీట్ సహా 20 జాతీయ పోటీ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తోంది.
జాతీయ పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలతో పాటు పరిపాలనాపరమైన సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పూర్తి స్థాయి పునర్నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది కేంద్రం. క్యాబినెట్ సమావేశంలో వ్యవస్థాగత జవాబుదారీతనంపై చర్చించారు. ఇందులో భాగంగా 47 మంది విద్యా మంత్రిత్వ శాఖ అధికారులను తొలగింపు, నిపుణుల సిఫార్సుల ఆధారంగా పరీక్షల అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో నిర్మాణాత్మక మార్పులు చేయడం వంటి అంశాలను చేర్చారు. ఇక.. విద్యా శాఖ కార్యదర్శిని కేంద్రం మార్చినప్పటికీ.. విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవిలో కొనసాగుతారని సమాచారం.












