తెలంగాణ

TG: కేసీఆర్‌ పాలమూరు ప్రజల గుండెల మీద తన్నాడు.. సీఎం రేవంత్‌ ఆగ్రహం

5 నిమిషాల పఠనం

TG: పాలమూరు ఎంపీగా గెలిచి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ నేల రుణం తీర్చుకుంటాడని నమ్మితే.. కేసీఆర్ పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్‌కు పారిపోయాడని సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’ వేదికగా బీఆర్‌ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

TG: పాలమూరు ఎంపీగా గెలిచి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన ఈ నేల రుణం తీర్చుకుంటాడని నమ్మితే.. కేసీఆర్ పాలమూరు ప్రజల గుండెలపై తన్ని గజ్వేల్‌కు పారిపోయాడని సీఎం రేవంత్‌రెడ్డి నిప్పులు చెరిగారు. వికారాబాద్ జిల్లా హకీంపేట్‌లో నిర్వహించిన ‘రైతన్నతో ఆత్మీయ సభ’ వేదికగా బీఆర్‌ఎస్ అధినేతపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు గడ్డ నుంచి పోటీ చేసి కేసీఆర్ సీఎంగా గెలవాలని ఇక్కడి ప్రజలు ఆశపడితే, ఆయన మాత్రం జిల్లాను నిలువునా మోసం చేశారని మండిపడ్డారు.

ప్రాజెక్టులను అడ్డుకునే శక్తులు తెలంగాణకు అవసరమా?

పాలమూరు బిడ్డల వలసల గోసపై రేవంత్‌రెడ్డి భావోద్వేగంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం నుంచి ఎందరో మంత్రులు వచ్చినా పాలమూరు నుంచి వలసలు మాత్రం ఆగలేదని, 75 ఏళ్లలో ఈ ప్రాంతానికి న్యాయం చేసిన నాథుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఉద్యమ సమయంలో మక్తల్-నారాయణపేట ప్రాజెక్టును తెరపైకి తెచ్చి, అధికారంలోకి వచ్చాక దాన్ని అటకెక్కించారని కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. ఇప్పుడు తమ ప్రభుత్వం మక్తల్-నారాయణపేట-కొడంగల్ పథకానికి ప్రాణం పోసి పనులు చేపడుతుంటే, దాన్ని కూడా అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టులను అడ్డుకునే ఇలాంటి ద్రోహులు తెలంగాణకు అవసరమా అని ప్రజలను సూటిగా ప్రశ్నించారు.

కేసీఆర్ పాపాలకు ఏటా రూ.80 వేల కోట్ల వడ్డీలు

మిగులు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో కేసీఆర్ జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి దిగజార్చారని సీఎం దుయ్యబట్టారు. గత పాలకులు చేసిన అప్పులు, తప్పుల కారణంగా రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.80 వేల కోట్లు కేవలం వడ్డీల రూపంలోనే కట్టాల్సి వస్తోందని, ఇప్పటివరకు ఏకంగా రూ.2 లక్షల కోట్లకు పైగా వడ్డీలు చెల్లించామని వివరించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జనవరి 1 నుంచి ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని, 10వ తేదీలోపు సంక్షేమ నిధులు, 20వ తేదీలోపు కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.

రూ.9,050 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం

ఈ బహిరంగ సభ సాక్షిగా వికారాబాద్, ఉమ్మడి పాలమూరు రూపురేఖలు మార్చేలా ఏకంగా రూ.9,050 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు. ఇందులో ప్రధానంగా ఎకో పామాయిల్ ఫ్యాక్టరీతో పాటు నాచారం నుంచి కొత్వాల్‌గూడ వరకు సుమారు రూ.5 వేల కోట్ల వ్యయంతో నిర్మించే రేడియల్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తనను గుండెల్లో పెట్టుకుని ఆశీర్వదించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు జీవితాంతం కష్టపడతానని రేవంత్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, డి. శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహా, వాకిటి శ్రీహరి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

#Telangana Politics#Revanth Reddy#KCR#K Chandrashekar Rao#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి