Abhijeet Deepke: దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబై నగరాలు తీవ్ర విషవాయువుల కోరల్లో చిక్కుకున్నాయి. రూల్స్ బేఖాతరు చేస్తూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా విచ్చలవిడిగా బాణసంచా పేల్చడంతో రెండు మహానగరాలు గ్యాస్ ఛాంబర్లుగా మారిపోయాయి. గాలి నాణ్యత పూర్తిగా ప్రమాదకర స్థాయికి పడిపోవడంతో నగరవాసులు శ్వాస తీసుకోలేక, కళ్లు మండి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ దారుణ పరిస్థితులపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు. ప్రజల విచక్షణారహిత ప్రవర్తనను ఎండగడుతూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తమ నాశనాన్ని తామే కోరుకుంటున్నారు..
కాలుష్య కోరల్లో చిక్కుకుని అల్లాడుతున్న నగరాల దుస్థితిపై అభిజీత్ దీప్కే సూటిగా స్పందించారు. "తమ జీవితాలను తామే ఇంత ఘోరంగా దుర్భరం చేసుకోవాలని ఇంత పట్టుదలగా ఉన్న ప్రజలను నేను నా జీవితంలో ఎన్నడూ చూడలేదు" అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం క్షణికానందం కోసం తమ ప్రాణాలను తామే పణంగా పెడుతున్నారని ఎద్దేవా చేశారు. పండుగలనేవి ప్రేమ, ఆనందాలను పంచుకోవడానికి ఉండాలని, కానీ ఇక్కడ ప్రజలు పండుగ ముసుగులో విద్వేషాన్ని, విషపూరిత వాయువులను పంచుతున్నారని మండిపడ్డారు.
370కి చేరిన AQI.. గాల్లో విషం
నిషేధాజ్ఞలు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను గాలికొదిలేసి టపాసులు కాల్చడంతో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 370కి ఎగబాకి 'వెరీ పూర్' కేటగిరీకి పడిపోయింది. బవానా, బురారీ, జహంగీర్‌పురి, సోనియా విహార్, పంజాబీ బాగ్, ఓఖ్లా, రోహిణి వంటి ప్రధాన ప్రాంతాల్లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకరమైన 'సివియర్' స్థాయిని తాకింది. రోడ్లపై దట్టమైన నల్లటి పొగమంచు కమ్మేయడంతో ఉదయం పూట ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనిపించని దుస్థితి నెలకొంది. ముంబైలోనూ ఇదే విధమైన పరిస్థితి ఉండటంతో చిన్నారులు, వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నారు. సొంత చేతులతోనే ప్రాణాంతక విషాన్ని గాల్లోకి వదిలి ప్రజలే తమ చావును కొనితెచ్చుకుంటున్నారంటూ దీప్కే చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.


