మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక నగరం ఉజ్జయినిలో మరోసారి తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. "సింహస్థ కుంభమేళా" ఏర్పాట్లలో భాగంగా నగరంలో రోడ్డు విస్తరణ పనులను అక్కడి ప్రభుత్వం చేపట్టింది. అయితే, విస్తరణ మార్గంలో అడ్డుగా ఉన్న 'షాహి దర్గా'కు చెందిన కొంత భాగాన్ని తొలగించేందుకు ఉజ్జయిని మున్సిపల్ అధికారులు ప్రయత్నించారు. దీంతో అక్కడ వివాదం చెలరేగింది. దర్గా తొలగింపు విషయంలో ముస్లిం వర్గాలు ఎదురుతిరిగాయి.దర్గాను టచ్ చేయవద్దని ఆందోళనకు దిగాయి.
ఒక వర్గం వారు రోడ్డు విస్తరణ పనులకు అడ్డంగా ఉన్న హనుమాన్ ఆలయాన్ని స్వయంగా తొలగించేందుకు సిద్ధపడగా.. ముస్లిం వర్గం వారు మాత్రం షాహీ దర్గాను తొలగించేందుకు అడ్డుపడుతున్నారు. దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడింది. పెద్దఎత్తున ముస్లిం ప్రజలు కూల్చివేతలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంతో పాటు రాళ్లు రువ్వుతున్నట్టు తెలిసింది.పరిస్థితి చేయి దాటిపోకుండా అధికారులు ఇవాళ నగరంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. నిరసనకారులను అదుపు చేసేందుకు, శాంతిభద్రతలను కాపాడేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
అందుకోసం పదుల సంఖ్యలో గుర్రాపు పటాలాలను రంగంలోకి దించారు. రెండు వర్గాల మధ్య మత ఘర్షణలు చెలరేగకుండా ఉండేందుకు పోలీసులు గాలిస్తూ నగరంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకుండా 24 గంటల పాటు పెట్రోలింగ్ నిలుస్తున్నారు.ఎవరైనా ఆందోళనలు చేస్తూ ఇతరలను దూషించడం వంటివి చేస్తే వారి లాఠీలకు పని చెబుతున్నారు.
కాగా, రోడ్డు విస్తరణ పనుల విషయంలో యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోందని మున్సిపల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాలు, కుంభమేళా భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఈ రోడ్డు విస్తరణ పనుల్లో ఎవరికీ మినహాయింపు ఇవ్వడం లేదని సమాచారం. దీనిలో భాగంగానే మధ్యప్రదేశ్ సీఎం ఇంటిని కూడా విస్తరణ మార్గంలో కూల్చివేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేయడం విశేషం. ప్రస్తుతం ఉజ్జయినిలో పోలీసు పహారా నడుమ షాహీ దర్గా కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.












