దేశవ్యాప్తంగా ప్రయాణికుల సేవలను మెరుగుపరచడం, మౌలిక వసతులను ఆధునికీకరించే లక్ష్యంతో 11విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ తిరుపతి విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) జారీ చేసింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (PPP) పద్ధతిలో నిర్వహణ, అభివృద్ధి, ఆధునికీకరణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి కట్టబెట్టనున్నారు.
ఈ విడతలో కేంద్రం తొలిసారిగా 'బండ్లింగ్' అనే వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. వాణిజ్యపరంగా ఎక్కువ రద్దీ, లాభాలు ఉన్న విమానాశ్రయంతో తక్కువ రద్దీ ఉన్న విమానాశ్రయాన్ని కలిపి ప్రైవేట్ రంగానికి ఇస్తున్నారు. అందులో భాగంగా తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంతో జతచేశారు. రిటైల్, కార్గో వంటి నాన్-ఏరోనాటికల్ ఆదాయ మార్గాలను పెంచడం దీని ప్రాథమిక ఉద్దేశం.
రూ.8,622 కోట్ల మేర భారీ పెట్టుబడులు వచ్చే చాన్స్
ఈ 11 విమానాశ్రయాల అభివృద్ధి కోసం ప్రైవేట్ సంస్థల ద్వారా సుమారు రూ.8,622 కోట్ల మేర భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు, పర్యాటకుల రాకపోకలతో తిరుపతి విమానాశ్రయంలో ఇటీవల కాలంలో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాలకు రోజువారీ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. భవిష్యత్తులో తిరుపతి తరహాలోనే రాష్ట్రంలోని రాజమండ్రి, కడప విమానాశ్రయాలను కూడా ప్రైవేటీకరించే అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.
లీజు నిబంధనల ప్రకారం విమానాశ్రయాల సంపూర్ణ యాజమాన్య హక్కులు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వద్దే ఉంటాయి. కేవలం నిర్వహణ బాధ్యతలు మాత్రమే ప్రైవేటు రంగానికి బదిలీ అవుతాయి. అలాగే ఒప్పందంలో భాగంగా మొదటి మూడేళ్లపాటు ప్రస్తుతం ఉన్న AAI సిబ్బందిలో కనీసం 60 శాతం మందిని ప్రైవేటు సంస్థలు కొనసాగించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ బిడ్డింగ్ దశకు చేరుకుంది.


