రేపు సిరిసిల్లలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల పర్యటనకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా కరీంనగర్ నుంచి నేరుగా సిరిసిల్లలోని కళాశాల మైదానానికి సీఎం చేరుకుంటారు.
పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో నేతన్నచౌక్, పాతబస్టాండ్, కొత్తచెరువు మీదుగా ర్యాలీగా రగుడు వద్ద బహిరంగసభ ప్రాంగణానికి చేరుకుంటారు. సీఎం స్వయంగా ర్యాలీలో ముందుండి నడవనున్నందున భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలను సమీకరించేలా నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సీఎం సభకోసం జనసమీకరణకు నేతలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. గత వారం రోజులుగా సిరిసిల్లలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్ మకాం వేసినట్టు తెలుస్తోంది. భారీగా జనసమీకరణ చేయాలంటూ నేతలకు టార్గెట్లు ఇస్తున్నట్టు సమాచారం. మహిళా సంఘాలకు ప్రత్యేకంగా జనసమీకరణ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. సభకు వచ్చే మహిళలు ఇందిరమ్మ చీరలు కట్టుకొని రావాలంటూ ఆదేశాలు సైతం జారీ చేసినట్టు టాక్ వినిపిస్తోంది.
సభకు రాని వారికి రూ.500 నుంచి రూ.1,500 వరకు జరిమానా విధిస్తామని బెదిరిస్టున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పలు అనుబంధ సంఘాలు సైతం జనాలను తరలించాలంటూ అల్టిమేటం జారీ చేసినట్టు తెలుస్తోంది.
ఎలాగైనా సభకు భారీగా జనాలను తరలించేందుకు కాంగ్రెస్ నేతల ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలాఉండగా, సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అభివృద్ధి పనులపై సిరిసిల్లలో చర్చ జరుగుతోంది. సీఎం సభకు ముందు రాజకీయ వేడి రాజుకుంది.సభలో సీఎం ఏం మాట్లాడుతారు? గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తి చూపుతారా? కేటీఆర్ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెబుతారా? అనేది వేచిచూడాల్సిందే.


