తెలంగాణ రాష్ట్రంలో కృత్రిమంగా బొగ్గు కొరతను సృష్టించి, తద్వారా విద్యుత్ కోతలకు దారితీసేలా చేసి ఒక భారీ విదేశీ బొగ్గు కొనుగోలు కుంభకోణానికి తెలంగాణ ప్రభుత్వం తెరలేపుతోందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశీయంగా నాణ్యమైన బొగ్గు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నప్పటికీ, కావాలని విదేశాల నుంచి అధిక ధరలకు దిగుమతి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు కాంట్రాక్టర్లు ముడుపుల ఆశ చూపి ఇంధన శాఖ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తుండటంతోనే ఈ ప్రతిపాదనలు ముమ్మరమయ్యాయని పరిశ్రమ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఏకంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును ఇండోనేషియా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం భారతదేశంలో టన్ను బొగ్గు ధర రూ.3,800 అందుబాటులో ఉండగా, విదేశాల నుంచి టన్నుకు రూ.10వేల నుంచి రూ.15వేల వరకు వెచ్చించి కొనుగోలు చేయడానికి ప్రాథమిక చర్చలు జరుగుతున్నాయి. ఇలా అత్యధిక ధరలకు విదేశీ బొగ్గును కొనుగోలు చేయడం వల్ల జెన్‌కో సంస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇలాంటి విదేశీ బొగ్గు కొనుగోలు ప్రతిపాదనను 2022లోనే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తిరస్కరించిన విషయాన్ని జెన్‌కో అధికారులు గుర్తుచేస్తున్నారు. విదేశీ బొగ్గు పూర్తిగా పొడి రూపంలో ఉండటం వల్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, స్వదేశీ బొగ్గు చిన్న రాళ్ల రూపంలో ఉండి ఉత్పత్తికి అనువుగా ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా రవాణా బాధ్యతలను కూడా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం వల్ల జెన్‌కోపై కోట్లాది రూపాయల అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం బకాయిలు చెల్లించలేదనే నెపంతో తమ వద్ద నాణ్యమైన బొగ్గు సరఫరా లేదని సింగరేణి సంస్థ చేతులెత్తేసేలా ప్రభుత్వం వాతావరణం కల్పించిందని విమర్శలు వస్తున్నాయి. అయితే థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన సరిపడా జి-9 (G-9) గ్రేడ్ బొగ్గు తమ వద్ద ఉన్పప్పటికీ, సింగరేణికి బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. నాణ్యమైన బొగ్గు లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ రకమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం థర్మల్ కేంద్రాల్లో 21రోజులకు సరిపడా ఉండాల్సిన బొగ్గు నిల్వలు కేవలం 4 రోజులకు మాత్రమే పడిపోవడంతో జెన్‌కో అధికారులు ఆందోళన చెందుతున్నారు. నైనీ కోల్ బ్లాక్, కోల్ ఇండియాతో ప్రస్తుత మార్కెట్ ధరకు చర్చలు జరపాలని జెన్‌కో సూచించినప్పటికీ, ఇంధన శాఖ అధికారులు కేవలం మహానది కోల్ బ్లాక్‌కు పాత ధరలకే ఇవ్వాలని లేఖలు రాయడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనల ప్రకారం ముందుకు వెళ్లకపోవడం వల్లే కోల్ ఇండియా కూడా బొగ్గు సరఫరాకు నిరాకరించిందని, ఇదంతా ఉద్దేశపూర్వకంగానే జరుగుతోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఈ దందా వెనుక ఒక ప్రముఖ బొగ్గు కాంట్రాక్టర్ కీలక రాయబారిగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ కాంట్రాక్టర్ చూపిన భారీ ముడుపుల ఆశలకే ఇంధన శాఖ అధికారులు విదేశీ బొగ్గు కొనుగోలు దిశగా మొగ్గు చూపుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కావాలనే కరెంట్ కోతలు సృష్టించి, బొగ్గు అత్యవసరమని చూపించి విదేశీ బొగ్గు ద్వారా వేల కోట్ల రూపాయల స్కామ్‌కు బాటలు వేస్తున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.


