బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత మరోసారి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే సీఎం అని కేసీఆర్ చెప్పడం వల్లే సమస్యలు తమ వరకు రాలేదని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కవిత ‘ఎక్స్’ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నేను మీ పార్టీలో ఒక్క అవినీతి గుంటనక్కను విమర్శిస్తేనే.. కొన్ని గంటల్లో పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అదే గుంటనక్కతో అంటకాగుతూ మీ పార్టీ అధినేత తీరుతోనే నష్టపోయామని మీరు బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం పార్టీ వ్యతిరేకం కాదా?’ అని ప్రశ్నించారు.
‘మీరు మీ పార్టీ అధినేత కేసీఆర్‌ను విమర్శించడం.. ఆయన తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను బాహాటంగా తప్పు పట్టడం పార్టీ వ్యతిరేక చర్య కాదా!?.. మీ ఫామ్‌హౌస్‌లు, అక్రమంగా ఇచ్చిన పర్మిషన్లు.. ఆంధ్రా దోస్తులకు ఇచ్చిన నజరానాలు.. క్విడ్ ప్రో కో దందాలతో మీ పార్టీని పాతాళంలోకి నెట్టింది మీరు కాదా?’ అని నిలదీశారు.
‘నిన్నటి బీఆర్ఎస్ మీటింగులో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుంటే "నీ పెండ్లామా!? అంత అర్జెంటా!? అని అహంకారంతో అతని భార్యనే అవమానించారు. ‘ఒక మహిళా సాయం కోరి వస్తే నా కోసం కన్నావా’ అని అమ్మనే అవమానించారు. గుంటనక్క మైండ్ గేమ్‌లో గుడ్డిగా పడిపోయి పెద్ద మనిషినే తప్పు బడుతున్నావ్.. బీఆర్ఎస్‌కు గోతిని తవ్వుతున్నావ్.
కూర్చున్న కొమ్మనే నరుక్కున్నట్టు.. పార్టీలో మీ వైఫల్యాన్ని మీ చేతగాని తనాన్ని బీఆర్ఎస్ అధినేతపై మోపుతున్నావు అంటే... ప్రత్యక్ష రాజకీయాల్లో మీ స్థానం ఏమిటో అర్థమవుతుందా? నిమజ్జనోత్సవంలో ఎంతమంది సోషల్ మీడియా influencersను బతిమాలుకున్నారో ఆ గణేష్ మహారాజుకు, మీ అంతరాత్మకు తెలుసు.. నేను నీలాగా విష నాగుల మాటలు విని మాట్లాడను.. నిర్ధిష్టమైన ఆధారాలతోనే మాట్లాడుతాను.. నాతో పెట్టుకోకు!’ అంటూ కవిత హెచ్చరికలు పంపారు.
ఇదిలాఉండా, బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేశాక ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన కవిత.. తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) పార్టీని స్థాపించి రాజకీయంగా నిలదొక్కుకోవడానికి పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.


