అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా దిగివస్తున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిల్లో పసిడి ధరలు తగ్గుముఖం పట్టడం సామాన్యులకు, ముఖ్యంగా పండగ వేళ కొనుగోలుదారులకు గొప్ప ఊరటనిస్తోంది. బలమైన అమెరికన్ డాలర్ సూచీతో పాటు వచ్చే ఏడాది యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్‌లో బులియన్ వ్యాపారంపై తీవ్ర ఒత్తిడి నెలకొంది.
గత నాలుగైదు రోజుల్లోనే తులం బంగారంపై ఏకంగా రూ.4వేలకు పైగా తగ్గగా, వారం రోజుల్లో మొత్తంగా రూ.6వేల నుంచి రూ. 7,000 వరకు పడిపోయింది. మంగళవారం ఒక్కరోజే తులంపై రూ.1,370 మేర తగ్గుదల నమోదైంది. ప్రధాన నగరాల్లో సెప్టెంబర్ 29 నాటి పసిడి, వెండి ధరల వివరాలిలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు (హైదరాబాద్, విజయవాడ): 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,800 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,36,400 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,48,800, 22 క్యారెట్ల ధర రూ.1,36,400 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,48,950, 22 క్యారెట్ల ధర రూ. 1,36,550 వద్ద నమోదు కాగా, కిలో వెండి ధర రూ. 2,40,000 మార్కు వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో బంగారం ఔన్సుకు $4,168 వద్ద, వెండి ఔన్సుకు $61 వద్ద స్వల్ప తగ్గుదలతో ట్రేడవుతున్నాయి.
ధరలు గణనీయంగా దిగిరావడంతో నగల షాపుల వైపు కొనుగోలుదారులు అడుగులు వేస్తున్నారు. స్థానిక పన్నులు, ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండే అవకాశం ఉన్నందున కొనుగోలుకు ముందు స్థానిక షాపుల్లో ధరలను సరిచూసుకోవడం మంచిది.


