Regina Cassandra: సౌత్ సినిమా పరిశ్రమను, ఇక్కడి మేకర్లను తక్కువ చేసి మాట్లాడే నార్త్ హీరోయిన్స్ తీరుపై నటి రెజీనా కాసాండ్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల నటి రాధికా ఆప్టే దక్షిణాది సినీ పరిశ్రమపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలవగా.. దానికి ఏమాత్రం మొహమాటం లేకుండా రెజీనా కౌంటర్ ఇచ్చారు. "సౌత్ ఇండస్ట్రీపై అవాకులు చవాకులు పేలడానికి మీరేమన్నా తోపు హీరోయిన్లా?" అన్న రీతిలో రెజీనా నిలదీసిన తీరు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల నయనతార చిత్రం 'మహాశక్తి'లో నెగెటివ్ రోల్‌తో ప్రశంసలు అందుకున్న రెజీనా.. ఉత్తరాది నటీనటులు సౌత్ సినిమాపై చూపిస్తున్న కపట వైఖరిని బాహాటంగానే ఎండగట్టారు.
సౌత్‌ను అంటే ఊరుకునే ప్రసక్తే లేదు
దక్షిణాది చిత్ర పరిశ్రమ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచ స్థాయిలో సత్తా చాటుతుంటే.. కొందరు హీరోయిన్స్ ఇంకా సౌత్‌ను చిన్నచూపు చూసే ధోరణిలోనే మాట్లాడుతుండటంపై రెజీనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాధికా ఆప్టే చేసిన కామెంట్స్‌ను ప్రస్తావిస్తూ.. అవకాశాలు ఇచ్చిన పరిశ్రమలను కించపరిచేలా మాట్లాడటం కరెక్ట్ కాదని గట్టిగా హెచ్చరించారు. సౌత్ మేకర్స్‌ను విమర్శించే స్థాయి ఎవరికీ లేదని, ఇక్కడి సినిమా గౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
"మీరు మాట్లాడితే ప్రొఫెషనల్.. సౌత్ వాళ్లు అడిగితే పొగరా?"
నార్త్ నటీనటుల పట్ల అక్కడ ఉండే డబుల్ స్టాండర్డ్స్‌ను రెజీనా సూటిగా ప్రస్తావించారు. "నార్త్ హీరోయిన్లు ఏదైనా తమ అభిప్రాయం చెబితే.. 'ఆమె ఎంతో ప్రొఫెషనల్' అంటూ తెగ పొగిడేస్తారు. అదే సౌత్ నుంచి వెళ్లిన వాళ్లు తమ రైట్స్ గురించి మాట్లాడినా, న్యాయం అడిగినా వెంటనే 'పొగరుబోతులు' అని ముద్ర వేస్తారు" అని అన్నారు. బాలీవుడ్ బడా బ్యానర్ ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన 'కేసరి చాప్టర్ 2'లో అక్షయ్ కుమార్ పక్కన మెయిన్ రోల్ చేసినా.. ప్రమోషన్లలో తన పేరు తీసేశారని, స్పెషల్ సాంగ్‌లో తనను కనీసం ట్యాగ్ కూడా చేయలేదని రెజీనా గుర్తుచేశారు. దక్షిణాది నటిని అయినందుకే తనపై ఆ వివక్ష చూపించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సౌత్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుని.. ఇప్పుడు అదే పరిశ్రమను చిన్నచూపు చూస్తూ మాట్లాడటాన్ని రెజీనా తీవ్రంగా తప్పుబట్టారు. సౌత్ సినిమాపై అక్కసు వెళ్లగక్కే వారికి రెజీనా ఇచ్చిన ఈ అదిరిపోయే రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.


