Deepavali Puja Vidhanam: దీపావళి వచ్చిందంటే చాలు.. ఇల్లంతా పండుగ కళ వచ్చేస్తుంది. అయితే ఈసారి నరక చతుర్దశి, దీపావళి అమావాస్య రెండూ ఒకే రోజు రావడంతో.. అసలు దీపాలు ఎప్పుడు వెలిగించాలి? పూజ ఏ టైంలో ఎలా చేస్తే మంచిది? అనే సందేహం చాలామందిలో ఉంది. దీపావళి నాడు దీపాలు పెట్టడానికి ఒక పద్ధతి ఉంది. సరైన సమయంలో, సరైన రీతిలో దీపాలు వెలిగించి పూజ చేసుకుంటేనే ఆ లక్ష్మీదేవి కటాక్షం మన ఇంట్లో నిలుస్తుంది.
దీపాలు ఎప్పుడు వెలిగించాలి
దీపావళి రోజు దీపాలు పెట్టడానికి బెస్ట్ టైమ్ సాయంత్రం సంధ్యా సమయం. అంటే సూర్యుడు అస్తమించి చీకటి పడే వేళ. సరిగ్గా ఆ సమయంలోనే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని చెబుతారు. సాయంత్రం దీపాలు పెట్టే ముందు ఇంటి వెనుక వైపు తలుపులు మూసి ఉంచి, ముందు గుమ్మాలు వెడల్పుగా తెరిచి ఉంచాలి. ప్లాస్టిక్, పింగాణీ లాంటివి కాకుండా శుభ్రమైన మట్టి ప్రమిదల్లో నువ్వుల నూనె పోసి దీపాలు వెలిగించాలి. ఇంట్లోని పూజా గది నుంచి మొదలుపెట్టి.. గడపలు, కిటికీలు, బాల్కనీ, ఇంటి చుట్టూ దీపాలను వరసగా అమర్చాలి.
రాత్రి 12 వరకు వెలగాల్సిన 'నందా దీపం'
దీపావళి రాత్రి చేసే అత్యంత ముఖ్యమైన పని ఒకటి ఉంది. అదే నందా దీపం. దీనిని ఎలా పెట్టాలంటే.. ముందుగా ఒక శుభ్రమైన విస్తరాకులో అరకిలో గోధుమలను రాశిగా పోయాలి. తర్వాత ఆ గోధుమల మధ్యలో కాస్త పెద్ద మట్టి ప్రమిదను ఉంచి, నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఇలా వెలిగించిన దీపం రాత్రి 12 గంటల వరకు ఆరిపోకుండా నిండుగా వెలుగుతూనే ఉండాలి. గోధుమలు ధాన్యలక్ష్మికి సంకేతం. ఇలా రాత్రంతా దీపం వెలిగితే ఆ ఇంట్లో డబ్బుకు, తిండికి ఎప్పటికీ లోటు ఉండదని నమ్ముతారు.
పూజ ఇలా చేస్తేనే ఫలితం..
సాయంత్రం పూజ గదిలో లక్ష్మీదేవి ముందు కూర్చున్నప్పుడు కేవలం పిండివంటలు, పువ్వులు పెడితేనే సరిపోదు. ఇంకొన్ని ముఖ్యమైన నియమాలు కూడా పాటించాలి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును, అలాగే ఇంట్లో ఉన్న బంగారాన్ని ఒక వెండి పళ్లెంలో పెట్టి అమ్మవారి పాదాల చెంత ఉంచాలి. "తల్లీ.. నీ దయవల్ల సంపాదించాం, ఈ సంపద ఇలాగే నిలిచి ఉండాలి.. మాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలి" అని మనస్ఫూర్తిగా మొక్కుకోవాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన తీపి పదార్థాలు, పిండివంటలు నైవేద్యంగా పెట్టి కుటుంబమంతా కలిసి ప్రసాదం తీసుకోవాలి. మన పెద్దల ఆత్మలకు దారి చూపేందుకు యమదీపంతో పాటు బాణాసంచా వెలుగులు తోడ్పడతాయని చెబుతారు. కాబట్టి పెద్దలను తలుచుకుంటూ కూడా ఒక దీపం పెట్టడం మంచిది. పూజ పూర్తయి బాంబులు కాల్చిన తర్వాత.. ఇంట్లో ఎలాంటి నెగెటివ్ శక్తులు, దరిద్రం ఉండకుండా ఉండేందుకు చాటలు లేదా కంచాలు మోగిస్తూ శబ్దం చేసే పాత సంప్రదాయం ఇప్పటికీ పాటిస్తారు. ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ సరైన సమయంలో దీపాలు వెలిగించి పూజ చేసుకుంటే.. ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి స్వయంగా అడుగుపెడుతుందని పెద్దలు చెబుతున్నారు.
నోట్: ప్రాంతాలను బట్టి ఆచారాలు, పూజా విధానాల్లో మార్పులు ఉండవచ్చు.


