Regina Cassandra: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం ఎంత ముఖ్యమో.. వచ్చిన అవకాశాల్లో నటీనటులకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం కూడా అంతే ముఖ్యం. తాజాగా హీరోయిన్ రెజీనా కసాండ్రా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అటు బాలీవుడ్లో ఇటు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌పై రెజీనా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, తనను బాధపెట్టిన విషయాలను బయటపెట్టింది.
హిందీ సినిమా ‘కేసరి చాప్టర్ 2’ ప్రమోషన్లలో పక్కన పెట్టారు:
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘కేసరి చాప్టర్ 2’ సినిమాలో రెజీనా కసాండ్రా హీరోయిన్గా నటించింది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్ భార్యగా కనిపించారు. సినిమాలో మంచి ప్రాధాన్యత ఉన్న పాత్ర చేసినప్పటికీ, సినిమా ప్రమోషన్ల విషయంలో మాత్రం తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదని, ప్రమోషన్స్‌కి దూరంగా పెట్టారని రెజీనా ఆరోపించారు.
ముఖ్యంగా, ఈ సినిమాలో తనపై చిత్రీకరించిన ఒక పాటను ధర్మ ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో విడుదల చేసిందని, ఆ పాటలో మొదటి నుంచి చివరి వరకు తానే కనిపించినప్పటికీ తనను కనీసం ట్యాగ్ చేయలేదని కూడా రెజీనా ఇన్నాళ్ళకి తన ఆవేదనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రమోషన్లలో తన పేరును కూడా చేర్చలేదని, ఇలా ఎందుకు చేశారో కూడా కారణాన్ని ఇప్పటికీ తనకు చెప్పలేదని తాజాగా ఇచ్చిన ఇంటవ్యూలో చెప్పుకొచ్చింది. నేను సౌత్ హీరోయిన్ అన్న ఒక్క కారణంతోనే ఇలా చేశారని రెజీనా వాపోయింది. నాకు, హిందీ బాగా వచ్చినప్పటికీ సౌత్ హీరోయిన్ అంటూ వివక్షత చూపించినట్టుగా వెల్లడించింది.
జాన్వీ, రాధికా ఆప్టే వ్యాఖ్యలకి గట్టి కౌంటర్ ఇచ్చిన రెజీనా:
ఈ మధ్యనే పెద్ది సినిమా విషయంలో జాన్వీ కపూర్, లెజెండ్ సినిమా విషయంలో రాధికా ఆప్టే కామెంట్స్ చేశారు. దక్షిణాది సినిమాల్లో హీరోయిన్ల పాత్రల చిత్రీకరణ, తమకు ఎదురైన అనుభవాల గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై స్పందించిన రెజీనా.. ఇలాంటి చర్చలను నార్త్ వర్సెస్ సౌత్ అనే కోణంలోకి తీసుకెళ్లడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
ఒక సినిమాలో తమ పాత్ర లేదా సన్నివేశాల విషయంలో అసౌకర్యంగా అనిపిస్తే, నటీనటులకు వీలున్నప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకునే స్వేచ్ఛ కూడా ఉంటుందని ఆమె అన్నారు. ఒకరిద్దరి అనుభవాలను మొత్తం దక్షిణాది సినిమా పరిశ్రమకు ఆపాదించకూడదని సూచించారు. మీరు సౌత్ ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు. మరి, నాకు నార్త్ లో జరిగిన దాని గురించి ఎవరు మాట్లాడతారు అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మొత్తానికి, సౌత్ వర్సెస్ నార్త్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ గా ఇప్పుడు సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి.


