సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో వలస కూలీలు ఆందోళనకు దిగారు. చేసిన పనికి వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ సమయంలో జీతాలు చెల్లించకపోతే ఇంటికి డబ్బులు ఎలా పంపించాలని ఆందోళన చెందుతున్నారు. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం పోలేపల్లిలో నిర్మిస్తున్న ఎడ్యుకేషనల్ హబ్‌లో ఈ వలస కూలీలు పనిచేస్తున్నారు. అయితే, ఆ ప్రాజెక్టు మెయింటెన్ చేస్తున్న KLSR కన్‌స్ట్రక్షన్స్ తమకు కూలి డబ్బులు చెల్లించడం లేదంటూ ఇవాళ ఉదయం నిరసనకు దిగారు.
నేడు సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ పర్యటన ఉన్న నేపథ్యంలో ఆయనకు ఫిర్యాదు చేస్తామని కూలీలు చెబుతున్నారు. గత కొంతకాలంగా కేఎల్ఎస్ఆర్ కంపెనీ కూలి డబ్బులు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని యూపీ, బిహార్, జార్ఖండ్ నుంచి వచ్చి పనిచేస్తున్నకూలీలు ఆరోపిస్తున్నారు.డబ్బులు ఇవ్వకుండా తమతో పనులు చేయించుకుంటున్నారని, తాము, తమ కుటుంబాలు ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, కేఎల్‌ఎస్ కంపెనీ మీద తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ కంపెనీ రేవంత్ రెడ్డి బినామీ అని, రూ.5000 కోట్ల విలువగల భూమిని కబ్జా చేశారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. జవహర్‌నగర్ సర్వే నంబర్ 12లో ఉన్న భూమిని 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం జెన్‌పాక్ట్ అనే ఐటీ కంపెనీకి ఎకరానికి రూ.28 లక్షల చొప్పున ఇచ్చిందని, నాడు ఎలాంటి ప్రాజెక్టు డెవలప్ చేయకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో కేఎల్ఎస్ఆర్ కంపెనీ ఆ భూమిని కబ్జా చేసిందన్నారు. అదే కంపెనీలో రేవంత్ రెడ్డికి షేర్ ఉందని ఆరోపించారు.
ఇదిలాఉండగా, కేఎల్ఎస్‌ఆర్ ఇన్ఫ్రా కంపెనీ సీఎం రేవంత్ బినామీ కంపెనీ అని గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఆరోపించారు. ఈ ఏడాది జనవరి 23న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాపై సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తుచేశారు. దివాళా తీసిన కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇస్తున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని ప్రశ్న లేవనెత్తారు.
కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాకు రూ.6 వేల కోట్ల టెండర్లు ఇచ్చారని, సదరు కంపెనీని వెనుక నుంచి వేరే వాళ్లు నడిపిస్తున్నారన్నారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కేఎల్ఎస్ఆర్‌కు అప్పగించారని, రేవంత్ రెడ్డిపై గతంలో రైడ్స్ జరిగితే అందులో కేఎల్ఎస్ఆర్ కంపెనీ రేవంత్ బినామీ అని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేఎల్ఎస్ఆర్ కంపెనీలో రేవంత్ రెడ్డి బినామీ పెట్టుబడులు ఉన్నాయని 2018లోనే ఐటీ చెప్పిందని గతంలోనే గుర్తుచేసిన విషయం తెలిసిందే.


