Ramayana: సినిమా సామాన్య ప్రేక్షకుడికి అందుబాటులో ఉంటే ఎంత భారీ విజయం అందుకుంటుందో ఇటీవల వచ్చిన ఇరుముడి సినిమా నిరూపించింది. రవితేజ-శివ నిర్వాణ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అయితే, రవితేజకి వరుస ఫ్లాప్స్ వస్తున్న నేపథ్యంలో అటు ఏపీ ఇటు తెలంగాణలలో ఎలాంటి టికెట్ పెంపు లేకుండా విడుదల చేశారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు, రామాయణ సినిమాకి అలాగే ప్లాన్ చేశారు దిల్ రాజు.
టాలీవుడ్ అగ్ర నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఏపీలో వైజాగ్, తెలంగాణలో నైజాం మొత్తం రామాయణ సినిమాను విడుదల చేసేందుకు హక్కులను దక్కించుకున్నాడు. మైథలాజికల్ సినిమా అనగానే ప్రతీ ఒక్కరిలో ఆసక్తి విపరీతంగా పెరుగుతోంది. అందులోనూ, రామాయణ ఇతిహాసం అంటే ఇష్టం ఉండంది ఎవరికి చెప్పండి. అందుకే, ఈ కథను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారి.
రెండు భాగాల బడ్జెట్ రూ.4000 కోట్లు.
మన ఇండియన్ సినిమాలోనే హైయ్యెస్ట్ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది రామాయణ. గతంలో, ప్రభాస్ నటించిన ఆదిపురుష్ బడ్జెట్ 400 కోట్ల లోపే. ఇప్పుడు, మన దర్శక దిగ్గజం ఎస్.ఎస్.రాజమౌళి అంత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న వారణాసి సినిమా బడ్జెట్ 1400 కోట్ల వరకూ ఉంది. అయితే, ఇది ఒక పార్ట్ అనే ఇప్పటి వరకూ చెప్తూ వస్తున్నారు. ఒకవేళ, బాహుబలి మాదిరిగా వారణాసి కూడా రెండు భాగాలు చేస్తే ఇదే బడ్జెట్ డబుల్ అవుతుంది.
బాలీవుడ్లోనే అత్యంత భారీ బడ్జెట్ 4000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న రామాయణ పార్ట్ 1, ఈ దీపావళికి ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు. 100 కోట్లు దాటిన సినిమాకే టికెట్ హైక్ ఉంటున్న తరుణంలో 4000 కోట్లతో నిర్మిస్తున్న రామాయణకి మాత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా విడుదల చేయాలని రాజు గారు నిర్ణయించుకోవడం హర్షించదగ్గ విజయం. సినిమా గనక బావుండి ప్రేక్షకులను మెప్పిస్తే ఖచ్చితంగా భారీ లాభాలను చూడొచ్చు.


