DK Aruna: "తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు దొంగిలించి గెలిచిందా? రేవంత్ రెడ్డి ఓటు చోరీ చేసే సీఎం అయ్యారా?" అంటూ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లోని దౌల్తాబాద్ మండలం గోకఫసాల్ వాడ గ్రామంలో నిర్వహించిన ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కేంద్రంపై కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. "ఎస్ఐఆర్ ప్రక్రియ దేశంలో గతంలోనే ఎనిమిది సార్లు జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదో జరిగిపోతున్నట్లు రాహుల్ గాంధీ గగ్గోలు పెడుతున్నారు. విదేశీ వేదికలెక్కి దేశ పరువు తీసేలా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ మాటల ప్రకారం చూస్తే.. మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా ఓట్లు చోరీ చేసే అధికారంలోకి వచ్చారా? దీనికి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఏం సమాధానం చెబుతారు?" అంటూ నేరుగా ప్రశ్నించారు.
సొంత నియోజకవర్గంలో ప్రజలు సమస్యలతో అల్లాడుతుంటే పట్టించుకోకుండా, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో ధర్నాలు చేయడమేంటని అరుణ ఎద్దేవా చేశారు. కొడంగల్‌లో రోడ్ల విస్తరణ పేరుతో పేదల ఇళ్లను నయాపైసా పరిహారం ఇవ్వకుండా కూల్చివేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరు నచ్చకే ఇక్కడ రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లు వేయడం లేదని చెప్పారు. సంక్షేమ పథకాలను పేదలకు కాకుండా కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. త్వరలోనే కొడంగల్ పల్లె పల్లెకూ తిరుగుతానని, కాంగ్రెస్ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో తేల్చుకుంటామని హెచ్చరించారు.


