Vakiti Srihari: సాధారణంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు సమీక్షలు నిర్వహించారంటే.. మండల కేంద్రంలోనో లేదా కలెక్టరేట్‌లోనే ఓ నాలుగు గంటలు కూర్చొని, ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతుంటారు. కానీ మక్తల్ నియోజకవర్గంలో మాత్రం మంత్రి వాకిటి శ్రీహరి ఈ మొక్కుబడి తంతుకు పూర్తిగా చెక్ పెట్టేశారు. పల్లె సీమల్లో పేరుకుపోయిన అసలైన సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు సరికొత్త కార్యాచరణతో రంగంలోకి దిగారు. అమరచింత మండలంలోని 14 గ్రామాల అభివృద్ధిపై ఆయన చేపట్టిన ప్రత్యేక సమీక్ష ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది.
గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, స్థానిక నాయకులను ఎదురెదురుగా కూర్చోబెట్టుకుని మంత్రి స్వయంగా మాట్లాడారు. సమావేశం అంటే హడావుడిగా ముగించేయకుండా.. ప్రతి ఊరికి ప్రత్యేకంగా 20 నుంచి 30 నిమిషాల సమయం కేటాయించారు. "మీ గ్రామంలో రోడ్ల పరిస్థితి ఏంటి? తాగునీటి సరఫరా ఎలా ఉంది? కరెంట్, డ్రైనేజీ కష్టాలు ఏమైనా ఉన్నాయా? వెంటనే పరిష్కరించాల్సిన అత్యవసర పనులేంటి?" అంటూ క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక ప్రతినిధులు చెప్పిన ప్రతి చిన్న సమస్యను కూడా మంత్రి శ్రద్ధగా వింటూ, స్వయంగా తన చేతులతోనే డైరీలో రాసుకున్నారు.
సమస్యలు విని చేతులు దులుపుకోవడం కాకుండా, ఏ పల్లె సమస్యను ఎప్పటిలోగా పరిష్కరించాలనే దానికి స్పష్టమైన డెడ్‌లైన్ కూడా పెట్టారు. "చాలామంది మండల కేంద్రాలు, పట్టణాల సమస్యల గురించే మాట్లాడుతుంటారు.. కానీ మారుమూల గ్రామాల ప్రజలు పడే కష్టాలు ఎవరూ పట్టించుకోరు. ఆ విధానానికి స్వస్తి పలకడమే నా లక్ష్యం. ప్రతి పల్లె బాగుపడితేనే మన మక్తల్ గడ్డ బాగుపడుతుంది. అందుకే ఏ గ్రామాన్నీ నిర్లక్ష్యం చేయకుండా, సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా గట్టి ప్లాన్ వేశాం" అని మంత్రి శ్రీహరి తేల్చిచెప్పారు. ప్రజాప్రతినిధులు వచ్చి సమస్యలు రాసుకుని, టైమ్ లిమిట్ పెట్టి పరిష్కరిస్తామనడం పట్ల గ్రామాల్లో హర్షం వ్యక్తమవుతోంది.


