వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుపై నడుస్తున్న ఊహాగానాలకు తెర దించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాన్ని ప్రకటించారు. వైఎస్సార్‌సీపీలోకి మళ్లీ వెళ్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని పటాపంచలు చేశారు. సరికొత్త రాజకీయ అధ్యాయానికి శ్రీకారం చుడుతూ సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. చట్టసభల్లో ప్రజల తరఫున నిజాయితీగల గొంతుకగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని, శ్రీవారి ఆశీస్సులతో ప్రజా సేవలోకి పునఃప్రవేశిస్తున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్నట్లు విజయసాయి రెడ్డి అన్నారు. ఈ నెలలోనే విజయవాడ వేదికగా ఏర్పాటు చేసే ప్రెస్ మీట్‌లో పార్టీ పేరు, ప్రాథమిక ఎజెండా, భవిష్యత్ ప్రణాళికతో పాటు సమగ్ర విధివిధానాలను వెల్లడిస్తానని తెలిపారు. గతేడాది రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పినప్పటికీ, రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తన నిర్ణయాన్ని మార్చుకుని మళ్లీ ప్రజాక్షేత్రంలోకి రావాల్సిన అవసరం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
తనది స్వతంత్ర భావజాలమని, ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లేదా శక్తులకు లొంగకుండా కేవలం ఏపీ ప్రజల హక్కులు, ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ పార్టీ ఏర్పాటుతో పాటు సమాజంలో పారదర్శకత కోసం డిజిటల్ మీడియా సంస్థను కూడా విస్తృతం చేస్తున్నట్లు గతంలోనే సంకేతాలిచ్చిన ఆయన, సోషల్ మీడియా వేదికగా నిరంతరం ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. 'భారత్ జన వికాస్' పేరుతో నూతన పార్టీ ఆవిర్భవించనుందనే ప్రచారం నడుస్తున్న నేపథ్యంలో, ఈ ప్రకటనతో ఏపీ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
వైఎస్సార్‌సీపీ క్రమశిక్షణకు, వ్యూహాలకు కీలక సూత్రధారిగా వ్యవహరించిన విజయసాయి రెడ్డి, ఇప్పుడు అదే పార్టీకి విరుద్ధంగా సొంత జెండాతో ఏపీ ఎన్నికల బరిలోకి అడుగుపెట్టేందుకు సిద్ధపడడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. తిరుమలలో ఆయన చేసిన ఈ సంచలన ఆరోపణలు, ప్రకటనలు త్వరలో జరగబోయే రాజకీయ మార్పులకు సంకేతంగా నిలుస్తున్నాయి. విజయవాడలో జరగబోయే ఆ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రకటించబోయే సరికొత్త రాజకీయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


