రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమాలపై తన వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపు(గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఈ విషయమై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చర్చకు రాగలరా అని సవాల్ విసిరారు.
పొంగులేటి అక్రమాలకు సంబంధించిన అన్ని సాక్ష్యాధారాలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లకు త్వరలోనే అప్పగిస్తానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఈ తరహా అక్రమాల ఆధారాలతో సహా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా సమగ్రంగా లేఖ రాస్తానని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతామని, ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి తేల్చి చెప్పారు.
మంత్రి పొంగులేటి తనపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన దర్యాప్తు సంస్థల ముందు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. సొంత నియోజకవర్గం, రాష్ట్ర రాజకీయాల్లో మంత్రుల వైఖరిపై బీజేపీ విరుచుకుపడుతుండటం, రేపు అసెంబ్లీ వేదికగా బహిరంగ చర్చకు పిలుపునివ్వడంతో తెలంగాణ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ సవాల్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేదా కాంగ్రెస్ వర్గాలు ఎలా స్పందిస్తాయోనన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


