International

అమెరికా గ్రీన్ కార్డ్ నిబంధనలు మరింత కఠినతరం.. కొత్త మార్గదర్శకాలు!

రచన: Mamatha puppala••5 నిమిషాల పఠనం

అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్ కార్డ్) కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనలను పునరుద్ధరిస్తూ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) స్పష్టం చేసింది.

అమెరికాలో శాశ్వత నివాస హోదా(గ్రీన్ కార్డ్) కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. 'పబ్లిక్ ఛార్జ్' నిబంధనలను పునరుద్ధరిస్తూ కొత్త మార్గదర్శకాలు సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి రానున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) స్పష్టం చేసింది. ఈ నూతన విధానం వల్ల గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల ఆర్థిక పునాది, కుటుంబ పరిస్థితి, వారు పొందిన ప్రభుత్వ సంక్షేమ ఫలాలపై అధికారులు సునిశితంగా దర్యాప్తు చేయనున్నారు.

భవిష్యత్తులో దరఖాస్తుదారులు ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశం ఉందా లేదా అనే కోణంలో తీవ్రంగా పరిశీలించనుండటంతో ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారనుంది. నూతన నిబంధనల ప్రకారం.. ఫుడ్ స్టాంప్స్, గృహ వసతి ఆర్థిక సహాయం, కళాశాల విద్యకు పొందిన ప్రభుత్వ నిధులు వంటి సంక్షేమ పథకాలను వినియోగించుకున్న వారి వివరాలను అధికారులు ప్రత్యేకంగా విశ్లేషిస్తారు. సెప్టెంబర్ 18 లేదా ఆ తర్వాత సమర్పించే గ్రీన్ కార్డ్ (ఫారమ్ I-485) దరఖాస్తులకు ఈ కఠినమైన రూల్స్ వర్తిస్తాయి.

అయితే, 2022 డిసెంబర్ 23 నుంచి 2026 సెప్టెంబర్ 17మధ్యలో దరఖాస్తు పూర్తి చేసుకున్న వారికి పాత నిబంధనల ప్రకారమే పరిశీలన జరుగుతుంది. ఈ మార్పుల వల్ల ఫ్యామిలీ బేస్డ్, ఎంప్లాయ్‌మెంట్ బేస్డ్ కేటగిరీల్లో ఉన్న వేలాది మంది భారతీయ దరఖాస్తుదారులపై తీవ్ర ప్రభావం పడే అవకాశముంది. ఈ కొత్త మూల్యాంకనం పరిధిలోకి యూఎస్ పౌరులు, శాశ్వత నివాసితుల కుటుంబ సభ్యులతో పాటు ఉన్నత విద్యార్హతలు కలిగిన నిపుణులు, ప్రాధాన్యత ఉద్యోగులు, పెట్టుబడిదారులు వస్తారు.

దరఖాస్తుదారుడి వయస్సు, ఆరోగ్యం, ఆస్తులు, విద్య-నైపుణ్యాలతో పాటు స్పాన్సర్ సమర్పించే అఫిడవిట్ ఆఫ్ సపోర్ట్ (ఫారమ్ I-864) ను సమగ్రంగా తనిఖీ చేస్తారు. అయితే శరణార్థులు, ఆశ్రయం పొందినవారు మరియు మానవతావాద కేటగిరీ కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిబంధనల నుంచి మినహాయింపు లభించింది. ఏకపక్షంగా కేవలం సంక్షేమ ప్రయోజనాలు పొందారనే నెపంతో దరఖాస్తును తిరస్కరించకుండా, మొత్తం పరిస్థితులను సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.

గత ఆర్థిక సంవత్సరంలో గ్రీన్ కార్డ్ పొందిన దాదాపు 66,800మంది భారతీయులలో 61 శాతం మంది ఇప్పటికే యూఎస్ లో ఉంటూ తమ స్టేటస్ మార్చుకున్నవారే కావడంతో, ఈ కొత్త నిబంధనలు వారి భవిష్యత్తుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఒకవేళ పబ్లిక్ ఛార్జ్ కింద తిరస్కరణ ఎదురయ్యే సూచనలు ఉంటే, దరఖాస్తుదారులకు నగదు లేదా పూచీకత్తు బాండ్ (ఫారమ్ I-945) సమర్పించే అవకాశం కల్పిస్తారు. ఇప్పటికే అమెరికా పౌరసత్వం ఉన్నవారికి లేదా గ్రీన్ కార్డ్ కలిగినవారికి ఈ మార్పులతో ఎలాంటి ముప్పు లేదని అధికారులు స్పష్టం చేశారు.

#US Immigration Public Charge Rule 2026#USCIS Green Card New Rules September 18#Form I-485 Public Charge Assessment#Indian Green Card Applicants Impact#US Green Card Eligibility Changes#NRI Personal Finance News Telugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి