Neha Sharma: సినిమా తారలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) డీప్‌ఫేక్ వీడియోల బెడద రోజురోజుకూ మరింత శృతిమించుతోంది. ప్రముఖుల ముఖాలను మార్ఫ్ చేస్తూ అసభ్యకర కంటెంట్‌ను నెట్టింట వైరల్ చేస్తున్న ముఠాలపై ప్రముఖ హీరోయిన్ నేహా శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన ఫర్మిషన్ లేకుండా తన ముఖాన్ని వాడుతూ ఫేక్ వీడియోలు, చిత్రాలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని కచ్చితంగా చెప్పారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆమె పెట్టిన పోస్ట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
“ఇదొక సీరియస్ వార్నింగ్.. వెంటనే డిలీట్ చేయండి!”
తన పరువుకు భంగం కలిగించేలా సాగుతున్న ఈ సైబర్ వికృత చేష్టలపై నేహా శర్మ సూటిగా స్పందించారు. "నా పర్మిషన్ లేకుండా నా ముఖాన్ని ఉపయోగించి ఏఐ వీడియోలు, మార్ఫింగ్ ఇమేజ్‌లు తయారు చేస్తున్న వారికి గట్టి హెచ్చరిక జారీ చేస్తున్నా. వెంటనే ఈ పనులు ఆపేయండి. నా పర్సనల్ ఇమేజ్ను దిగజార్చేలా చేసే ప్రయత్నాలను ఏమాత్రం సహించను. ఇలాంటి మార్ఫింగ్ కంటెంట్‌ను సృష్టించే వారితో పాటు, వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారిని కూడా వదిలిపెట్టను" అని ఆమె గట్టిగా హెచ్చరించారు. ఫేక్ ఖాతాల వెనుక దాక్కుని తప్పించుకోవచ్చని అనుకుంటే పొరపాటని, ప్రతి ఒక్కరిపై పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరంగా ముందుకెళ్తానని స్పష్టం చేశారు. నెట్టింట ఉన్న ఆ అసభ్యకర కంటెంట్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.
హీరోయిన్లను వెంటాడుతున్న డీప్‌ఫేక్ దడ
ఇటీవల కాలంలో హీరోయిన్ల డీప్‌ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. కొద్దిరోజుల క్రితమే బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ డీప్‌ఫేక్ వీడియో నెట్టింట వైరల్ కావడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలోనూ రష్మిక మందన్న సహా పలువురు స్టార్ హీరోయిన్లు ఈ సమస్యను ఎదుర్కొన్నారు. తమ వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకునేందుకు, అసభ్యకర కంటెంట్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఇప్పటికే పలువురు ప్రముఖులు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. ఇప్పుడు నేహా శర్మ కూడా సైబర్ నేరగాళ్లపై న్యాయపోరాటానికి సిద్ధమవడంతో సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.


