Drought: తెలంగాణ కరువు పరిస్థితులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలో 315 మండలాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయని, వ్యవసాయ రంగంపై తీవ్రమైన ప్రభావం పడుతోందని తెలిపారు. రాష్ట్రానికి తక్షణ సాయం చేయాలని కేంద్రాన్ని కోరారు. రైతులకు ఉపశమనం కల్పించేందుకు సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర పంటల విత్తనాల పంపిణీకి వెంటనే ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఖేత్ బచావో అభియాన్పై కేంద్రమంత్రి శివరాజ్సింగ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించాలి
ఎల్ నినో, కరువు కారణంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రానికి వివరించారు. కరువు పరిస్థితుల కారణంగా రైతులు పంటల సాగు, దిగుబడులు, పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలియజేశారు. నీటి లభ్యత తగ్గిన ప్రాంతాల్లో సూక్ష్మ సేద్య పద్ధతులను ప్రోత్సహించడంతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు. రైతులు నష్టాల నుంచి బయటపడేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
పంటలకు 100శాతం మద్దతు ధర కల్పించాలి
వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలోనూ కీలక ప్రతిపాదనలు చేశారు. మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలకు 100 శాతం మద్దతు ధర కల్పించాలని కోరారు. ధరల మద్దతు పథకం కింద 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించాలన్నారు. ఇక రసాయన ఎరువుల ధరలు, వాటిపై ఇచ్చే రాయితీలను హేతుబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించే కార్యక్రమాలను విస్తరించాలన్నారు. నీటి సంరక్షణ పనులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్రానికి విన్నవించారు మంత్రి తుమ్మల.


