రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు.. అంతకంటే ముఖ్యంగా, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. ఒకనాడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హవా నడిపించుకున్న ఎందరో నాయకులు.. కాలక్రమంలో తమ ఉనికిని కోల్పోయారు.. ఇక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఆ రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపం. కానీ నేటి రాజకీయాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి..
అదేవిధంగా ప్రజలను వంచించిన ప్రభుత్వం కానీ.. నాయకుడు గానీ చరిత్ర పుటల్లో కనుమరుగైపోవాల్సిందే.. ఇలాంటి సంఘటనలు నిరూపించబడినవి కూడా.. ఇక ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. అయితే ఇప్పటి నుండి రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కొందరు.. లేదు ప్రజల్లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందని మరికొందరు చర్చించుకుంటున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికే ఎక్కువ ఛాన్స్ ఉందనే టాక్ కూడా జనంలో నుండి వినిపిస్తుంది.. మొత్తంగా తెలంగాణ రాజకీయాలపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బిగ్ డిబేట్ నడుస్తోంది. ఒకవైపు పదేళ్ల గులాబీ పాలన.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న హామీల అమలు తీరుపై.. ఇక పదేళ్ల కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్న జనం.. పెద్ద దొర రాష్ట్రానికి మంచి చేశాడని ఆయన పాలనలో నీళ్లకు, కరెంట్ కు, వ్యవసాయ రంగానికి లోటు రాకుండా చూసుకున్నాడని చర్చించుకుంటున్నారు.
అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు చేరడం బీఆర్ఎస్ సాధించిన విజయాలుగా చెబుతున్నారు. ఇక దేశానికే రోల్ మోడల్గా నిలిచిన రైతు బంధు పథకం ద్వారా అన్నదాతలకు నేరుగా ఆర్థిక సాయం అందడం గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఆసరా పెన్షన్లు, దళిత బంధు వంటి సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో బలమైన ముద్ర వేసాయని చర్చించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.
ఇక బీఆర్ఎస్ పై ఉన్న అసంతృప్తిని కాంగ్రెస్ అవకాశంగా మలచుకుని అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం, నిధుల సర్దుబాటులో ఇబ్బందులు, ప్రజల్లో ప్రభుత్వం పై పెరుగుతున్న అంచనాల కారణంగా కొన్ని వర్గాల నుండి విభిన్నమైన అభిప్రాయాలు, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అదేవిధంగా ప్రస్తుత అధికార పార్టీలో సమన్వయ లోపాలు, హామీల అమలులో ఆలస్యం కావడంతో జనాలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయంగా చూస్తున్నారని అనుకుంటున్నారు..
ఇదే సమయంలో బీఆర్ఎస్ అధినేతలు కేసీఆర్ ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉండేదనే భావనను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. అయితే స్వతహాగా రాష్ట్రంలో 2023లో కేసీఆర్ ఓడిపోగానే ఆయన పని అయిపోయిందనే ప్రచారం మొదలైంది. మరోవైపు 2024 లో లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఒక్క పార్లమెంట్ సీటు కూడా రాక పోవడం మరింత ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చిందనే టాక్ వినిపించింది.
ఇక్కడితో బీఆర్ఎస్ కు ఓటమి అనుభవాలు ఆగలేదు.. ఆ తరువాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ రెండు ఎమ్మెల్యే సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కి చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖేల్ ఖతం అనే ప్రచారం ఒక స్థాయిలో మొదలైంది. అదీగాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం మళ్ళీ అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీనే.. ముఖ్యమంత్రి అయ్యేది నేనే అనే ధీమాతో ఉన్నారు..
అయితే కాంగ్రెస్ ఆశలు, బీఆర్ఎస్ ఊహలు నిజం అవుతాయా అనే చర్చలు సాగుతుండగా.. తాజాగా ఖైరతాబాద్ లో ఆర్ఆర్ అనే ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో ఊహించని నిజాలు బయటికి వచ్చాయి.. మరోసారి తెలంగాణాలో అధికారం బీఆర్ఎస్ దే అని ఈ సర్వే తేల్చింది.. ఖైరతాబాద్ ఉప ఎన్నికల గురించి నిర్వహించిన జనాభిప్రాయాన్ని ఆర్ ఆర్ సర్వే వెల్లడించింది.
ఈ సర్వేలో భాగంగా కేసీఆర్ పాలన గురించి జనాలను ప్రశ్నించినపుడు అత్యధిక శాతం ఆయన హయాంలో బాగుంది అని చెప్పారని.. అదేవిధంగా 2028 లో జరిగే ఎన్నికల్లో సీఎం ఎవరు అంటే కేసీఆర్ అని ఏకంగా 53.84 శాతం మంది ఓటేశారని వెల్లడించింది. మరోవైపు రేవంత్ రెడ్డికి 20.87 శాతం మద్దతు తెలిపితే.. కేంద్ర మంత్రి బండి సంజయ్ తదుపరి సీఎం అంటూ 14.30 శాతం మంది ఓటేశారని సర్వే వెల్లడించింది.
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి 4.39 శాతం ఓటింగ్ లభించింది. ఈ సర్వే ప్రకారం చూస్తే కేసీఆర్ ఎక్కువగా తెలంగాణా ప్రజల అభిమానం అందుకున్నారని తెలినట్టు వెల్లడించింది.. అదేవిధంగా రెండు సార్లు సీఎం గా చేసిన కేసీఆర్ కి మద్దతుగా 57.14 శాతం మంది నిలవగా.. రేవంత్ రెడ్డి రెండున్నరేళ్ళ పాలన బాగుందని 21.97 శాతం మంది మాత్రమే మద్దతు ఇచ్చినట్టు ఆర్ఆర్ సర్వే వెల్లడించింది.
ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నట్లుగా ఆ పార్టీ అభివృద్ధి సంక్షేమం పట్ల జనం అంత సంతృప్తిగా లేరని ఈ సర్వే అంటుంది. అంతే కాదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కంటే ఎన్నికల హామీల అమలుతో సక్రమంగా పనిచేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అయినట్టు తేల్చింది. ఇక బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు 54.94 శాతం మంది చెప్పగా.. కాంగ్రెస్ హామీల విషయంలో వెనకబడినట్టు ఆ పార్టీకి 19.78 శాతం ప్రజల మద్దతు ఇచ్చినట్టు సర్వే పేర్కొంది.
ఇవన్నీ పక్కన పెడితే గత రెండున్నరేళ్ల నుండి కేసీఆర్ జనంలో లేరు, పెద్దగా సభలు సమావేశాలు కూడా నిర్వహించలేదు. కానీ ఆయన తదుపరి సీఎం అని జనాలు అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ హామీలు బాగా నెరవేర్చిందని సమర్ధిస్తున్నారు.. అలాగే ఎన్నికల ముందు కేసీఆర్ జనంలోకి వచ్చి ప్రచారం చేస్తే ఇంకా పార్టీకి మైలేజ్ వస్తుందని నమ్ముతున్నారు.
మరోవైపు ఒక ప్రభుత్వాన్ని అయిదేళ్లకంటే ఎక్కువ భరించలేమని ప్రజలు భావిస్తున్నట్టు తెలుస్తుందని కొన్ని నివేదికలు తేల్చుతున్నాయి. రెండోసారి చాన్స్ ఇచ్చేందుకు ఇష్టపడడం లేదని తమిళనాడు ఎన్నికలు నిరూపించినట్టు చెబుతున్నారు.. అలాగే ఏపీలో వరుస మూడు ఎన్నికల్లో అలాగే జరిగిందని, దీన్ని బట్టి చూస్తే.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణాలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురావుతుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి.. ఇది తేలాలంటే ఎన్నికల వరకు ఆగవలసిందే..


