Elnino: తెలంగాణకు ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఎల్ నినో ప్రభావం రాష్ట్రంపై తీవ్రంగా ఉందన్న ఆయన.. ప్రజలంతా నీటిని, విద్యుత్ ను అత్యంత పొదుపుగా వినిగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సహజ వనరులను బాధ్యతాయుతంగా వాడుకోవాలన్నారు. హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్ 2026’ కార్యక్రమానికి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజేతలకు పురస్కారాలు అందజేశారు.
20వేల మెగా వాట్లకు విద్యుత్ డిమాండ్
ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ సుమారు 20వేల మెగా వాట్లకు చేరుకుందన్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో కరెంటు వాడకం భారీగా పెరిగిందన్నారు. ఈ పరిస్థితుల్లో నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేలా యువ దర్శకులు దృష్టి సారించాలని సూచించారు.
కలిసికట్టుగా కరువు పరిస్థితులను ఎదుర్కొందాం
గతంలో అక్టోబర్, నవంబర్ నెలల్లో చలి ఎక్కువగా ఉండేదన్నారు. ఈసారి మాత్రం ఎల్ నినో ప్రభావంతో అందుకు పూర్తి భిన్నమైన వాతావరణం ఉందని, ఎండలు మండిపోతున్నాయని, విపరీతమైన వేడితో ఇబ్బందులు పడుతున్నామన్నారు. వాతావరణ మార్పులతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగిపోయినందున.. అవసరమైన మేరకే కరెంటును వినియోగించాలని సూచించారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో నీటిని వృథా చేయొద్దని కోరారు. నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు. నీరు, విద్యుత్ పొదుపు విషయంలో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరువు పరిస్థితులను ఎదుర్కోవడం, రైతులకు అండగా నిలవడం, నీటి వనరులను కాపాడుకోవడం ప్రస్తుతం అత్యంత కీలకమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
నీరు, విద్యుత్ పొదుపుపై ప్రజలను చైతన్యవంతం చేయాలి
''ఎల్ నినో వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను యువ దర్శకులు తమ క్రియేటివిటీతో షార్ట్ ఫిలిమ్స్ తీసి ప్రజలను చైతన్యవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి మేరకు విద్యుత్, నీటి పొదుపుపై యువ హీరో విజయ్ దేవరకొండ ఇప్పటికే ప్రజలకు ఒక సందేశం పంపించారు. మిగతా వారు కూడా అలానే చేయండి. హీరోలంతా ఈ సమాజానికి ఒక మార్గాన్ని చూపించండి. ఎల్ నినో కారణంగా వర్షాలు కురవలేదు. వచ్చే ఏడాది జూలై 15వ తేదీ వరకు వానలు పడవు. అంటే ఇంకొక 9, 10 నెలలు ఉన్న నీటినే జాగ్రత్తగా కాపాడుకోవాలి'' అని ప్రజలకు సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
మీ సృజనాత్మకతను సమాజ హితం కోసం వాడాలి
''సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ స్ఫూర్తితో యువ దర్శకులు తమ సృజనాత్మకతను సమాజ హితం కోసం ఉపయోగించాలి. కేవలం వినోదానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు వంటి కీలక సమస్యలపై ప్రజల్లో చైతన్యం తెచ్చేలా షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాలి. హైదరాబాద్ను భారతీయ సినిమా పరిశ్రమకు ప్రధాన కూడలిగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం. స్థానిక కళాకారులు, యువ దర్శకులను ప్రోత్సహిస్తూ నగరంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు కల్పించేందుకు సీఎం రేవంత్ నాయకత్వంలో మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది'' అని భట్టి విక్రమార్క తెలిపారు.


