FSSAI: మనం మార్కెట్లో పేరున్న బ్రాండ్లు అని నమ్మి కొనే ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీ జరుగుతోందో తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ప్రముఖ కంపెనీలైన ప్రియగోల్డ్ బిస్కెట్లు, దొడ్ల పాలల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ప్రియగోల్డ్ బిస్కెట్ల తయారీలో ఏకంగా పశువుల దాణాను వాడుతుండగా, దొడ్ల పాలలో విషపూరిత డిటర్జెంట్ అవశేషాలు ఉన్నట్లు భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) గుర్తించింది. రూల్స్ బేఖాతరు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో (ప్రియగోల్డ్), దొడ్ల డెయిరీ, యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ సంస్థలపై చట్టపరమైన ప్రాసిక్యూషన్‌ను ప్రారంభించినట్లు అధికారులు వెల్లడించారు.
ఓ కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో ప్రియగోల్డ్ బిస్కెట్లను తయారుచేసే ‘సూర్య ఫుడ్ అండ్ ఆగ్రో’ తయారీ కేంద్రంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో బిస్కెట్లలో ఫైబర్ కంటెంట్ చూపించేందుకు పశువుల దాణాగా ఉపయోగించే తవుడును వినియోగిస్తున్నట్లు తేలింది. కేవలం పశువుల మేత కోసమే అని లేబుల్ చేసి ఉన్న బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు ప్లాంట్‌లో ఈగలు, పురుగుల బెడదతో తీవ్ర అపరిశుభ్రత, ముడిసరుకుల స్టోరేజీలో లోపాలను గుర్తించిన అధికారులు వెంటనే ఆ ప్లాంట్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ప్రాసిక్యూషన్‌కు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు ప్రముఖ సంస్థ ‘దొడ్ల డెయిరీ’ బండారం కూడా లాబ్ పరీక్షల్లో బయటపడింది. మార్కెట్లో విక్రయిస్తున్న దొడ్ల 'ఫుల్ క్రీమ్ మిల్క్' శాంపిల్స్‌ను పరిశీలించగా, పాల నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్లు తేలింది. అందులో డిటర్జెంట్ లేదా కాస్టిక్ సోడా అవశేషాలు ఉన్నట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా పాలలో సహజంగా ఉండాల్సిన పాల ఫ్యాట్ శాతం కనీస స్థాయి కంటే చాలా తక్కువగా ఉంది. ఇదే క్రమంలో ఆర్గానిక్ పేరుతో ఎక్కువ ధరకు విక్రయించే యూఈఐఆర్ ఆర్గానిక్ ఫుడ్స్ విక్రయిస్తున్న పసుపు రంగు ఎండు ద్రాక్షల్లో నిర్ణీత పరిమితికి మించి హానికర పురుగుమందుల అవశేషాలు బయటపడ్డాయి. ఆరోగ్యకరమైన ఉత్పత్తుల పేరుతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్న ఈ సంస్థలన్నింటిపై FSSAI కఠిన చట్టపరమైన చర్యలు ప్రారంభించింది.


