రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ట్రాఫిక్ కష్టాల గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఒక్కోసారి సామాన్యులతో పాటు మంత్రులకు కూడా ఈ తిప్పలు తప్పవు.. ఇక ముంబయి అంటేనే పరుగులు పెట్టే నగరం.. కానీ ఇప్పుడు ఆ పరుగులకు ట్రాఫిక్ బ్రేకులు వేస్తోంది. గంటల తరబడి రోడ్లపైనే నిలిచిపోతున్న వాహనాలు.. పెరుగుతున్న రద్దీ.. దశాబ్దాల క్రితం నిర్మించిన మౌలిక వసతులు..
ఇవన్నీ కలిసి దేశ ఆర్థిక రాజధాని ముంబయికి కొత్త సవాలుగా మారుతున్నాయి. ఈ పరిస్థితిపై కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముంబయిలో జరిగిన 22వ ఇండో-అమెరికన్ కార్పొరేట్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి గడ్కరీ గంట ఆలస్యంగా చేరుకున్నారు. వర్లీ నుంచి హోటల్‌కు ముందుగానే బయల్దేరినా.. ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో సమయానికి చేరుకోలేకపోయానని ఆయన తెలిపారు...
తన ఆలస్యానికి క్షమాపణలు చెబుతూ.. తాను చేసిన పోరబాటుకు మూల్యం చెల్లించుకుంటున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మరోవైపు 1995 నుంచి 2000 మధ్య మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో 55 ఫ్లైఓవర్లు, బాంద్రా-వర్లీ సీ లింక్, ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వే వంటి కీలక ప్రాజెక్టులను చేపట్టే అవకాశం తనకు వచ్చిందని ఆయన గుర్తుచేశారు.
అయితే అప్పట్లో సరైన నిర్మాణ సాంకేతికత అందుబాటులో లేకపోవడంతో అనుకున్న స్థాయిలో పనులు చేపట్టలేకపోయామని వివరించారు. కాలం మారింది.. నగరాల జనాభా, వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. కానీ దశాబ్దాల క్రితం నిర్మించిన రహదారులు, ఫ్లైఓవర్ల విషయంలో మార్పులు జరగలేదు.. దీంతో ముంబయి మాత్రమే కాదు.. దేశంలోని అనేక నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు కొత్త తరహా పరిష్కారాలు అవసరమని గడ్కరీ స్పష్టం చేశారు.
పాత ఫ్లైఓవర్లను క్రమంగా ఆధునిక నిర్మాణాలతో భర్తీ చేయాలని, సంప్రదాయ డిజైన్లకే పరిమితం కాకుండా అధునాతన సాంకేతికతను ఉపయోగించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌కు తాను సూచించినట్లు పేర్కొన్నారు. అలాగే పుణెలో ప్రతిపాదితంగా ఉన్న సుమారు 50 వేల కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టును కూడా గడ్కరీ ప్రస్తావించారు.
ఒకే సెట్ పిల్లర్లపై అనేక స్థాయిల ఫ్లైఓవర్లు నిర్మించే మల్టీ-లెవల్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు తెలిపారు. అవసరమైతే అదే నిర్మాణంపై మెట్రో కారిడార్‌ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని వివరించారు. అలాగే భారత్ సాంకేతిక, మానవ వనరుల సామర్థ్యాలకు అమెరికా వనరులు, నైపుణ్యాన్ని జోడిస్తే.. మౌలిక వసతులు, రవాణా సహా అనేక రంగాల్లో కొత్త పరిష్కారాలు సాధ్యమవుతాయని ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు.










