దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రతిభకు పట్టం కట్టే ప్రతిష్టాత్మక వేదిక.. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్.. సైమా 2026 వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. తొలిరోజు తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్లు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులతో వేదిక మొత్తం సందడిగా మారింది.
గత ఏడాది దక్షిణాదిలో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సినిమాలు, తమ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కళాకారులు, చిత్రాలకు వెన్నెముకగా నిలిచిన సాంకేతిక నిపుణులను సైమా వేదికపై ఘనంగా సత్కరిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా నుంచి పలువురు విజేతలుగా నిలవడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
ఇక ఈసారి ఉత్తమ నటుడి విభాగంలో మిరాయ్ సినిమాతో తేజ సజ్జా అవార్డును సొంతం చేసుకున్నారు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకుంటున్న తేజకు సైమా వంటి ప్రతిష్టాత్మక వేదికపై ఈ గుర్తింపు దక్కడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో మెప్పించిన ఐశ్వర్య రాజేష్.. క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా అవార్డును అందుకున్నారు. ఈ పాత్రలో ఆమె కనబరిచిన సహజమైన నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా బుల్లిరాజు పాత్రలో తన కామెడీ టైమింగ్‌తో థియేటర్లలో నవ్వులు పూయించిన భీమల రేవంత్.. ఉత్తమ సహాయ నటుడిగా పురస్కారం అందుకున్నారు.
సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని హాస్య సన్నివేశాల్లో బుల్లిరాజు పాత్ర ప్రత్యేకంగా నిలవడంతో ఈ అవార్డు ఆయనకు మరింత గుర్తింపును తీసుకొచ్చింది. అలాగే మ్యూజిక్ కేటగిరీలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా సత్తా చాటింది. ఈ చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డును రమణ గోగుల అందుకున్నారు. ఇక కోర్ట్ చిత్రానికి ఉత్తమ నేపథ్య గాయనిగా సమీరా భరద్వాజ్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు..










