National

National : పార్టీ ఫిరాయిస్తే 10 ఏళ్లు నిషేధం విధించాలి : కపిల్ సిబల్

రచన: Kumar4 నిమిషాల పఠనం

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు.

రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపులను అరికట్టేందుకు రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ సరిపోవడం లేదని, దాన్ని పూర్తిగా రద్దు చేయాలని సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత యాంటీ డిఫెక్షన్ చట్టాన్ని పూర్తిగా మార్చాలని చెప్పారు. పార్టీ మారే ప్రజాప్రతినిధుల కోసం కఠిన నిబంధనలు తేవాలన్నారు. మధ్యలో పార్టీ మారిన ప్రజాప్రతినిధిని పదేళ్ల పాటు ప్రభుత్వ పదవి,ప్రజా పదవి లేదా రాజ్యాంగబద్ధమైన హోదా చేపట్టకుండా నిషేధించాలని అన్నారు. అప్పుడే ఫిరాయింపులకు అడ్డుకట్ట పడుతుందని కీలక ప్రతిపాదన చేశారు.

కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో ‘ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్’ నిర్వహించిన ‘హార్స్-ట్రేడ్ అండ్ డెమోక్రసీ’ అంశంపై ప్రసంగించిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ మారిన వారిపైనే కాకుండా, రాజీనామా చేసి తిరిగి ఉపఎన్నికల్లో పోటీ చేసే కొత్త తరహా ఫిరాయింపులపైనా పదేండ్ల నిషేధం విధించాలని సిబల్ వెల్లడించారు.యాంటీ డిఫెక్షన్ చట్టంలోని రూల్స్ ఎలా దుర్వినియోగానికి గురయ్యాయో చెప్పేందుకు గతంలోని బీఎస్పీ ఉదంతాన్ని ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

స్ప్లిట్ నిబంధన రద్దు..

గతంలో మూడో వంతు సభ్యులు పార్టీని వీడితే ‘స్ప్లిట్’గా పరిగణించే ఈ రూల్‌ను వాడుకునేందుకు దశలవారీగా సభ్యులు పార్టీ మారారన్నారు. చివరకు అవసరమైన సంఖ్యకు చేరుకున్నాక స్పీకర్ దానిని చెల్లుబాటుగా ప్రకటించారని.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లాక అది తప్పని తేలిందన్నారు. 2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కార్.. 10వ షెడ్యూల్‌లోని ‘స్ప్లిట్’ నిబంధనను తొలగించిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ‘మెర్జర్’ నిబంధన కూడా అదే తరహాలో దుర్వినియోగం అవుతోందని సిబల్ ఆరోపించారు.

ఈ మధ్యకాలంలో ఆప్, శివసేన (యూబీటీ), టీఎంసీకి సంబంధించిన పరిణామాలను సిబల్ మరోసారి ప్రస్తావించారు.ఒక పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించాక ప్రజాప్రతినిధులు మరో పార్టీలో విలీనం కావడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయన్నారు. ప్రజల తీర్పును ఇలాంటి విలీనాలు ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. విలీనం అనేది కేవలం శాసనసభా పక్షానికి కాకుండా.. మొత్తం రాజకీయ పార్టీకే సంబంధించినదిగా ఉండాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసినట్టు కపిల్ సిబల్ తెలిపారు.

#kabil sibal#congress#defection#politics#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి