వివాహేతర సంబంధం ముసుగులో ఓ మహిళ దారి తప్పింది. తనకు జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా అడ్డుతొలగించుకోవడానికి ప్రయత్నించింది.చివరకు ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. తల్లిని అంతమొందించడంతో పాటు కన్న కొడుకును కూడా వదిలేసి పరార్ అయ్యింది. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా పొన్నూరు క్యాబిన్‌పేటలో చోటుచేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. కట్టుకున్న భర్త మరణించడంతో కుమారుడితో కలిసి తల్లి వద్దే ఉంటున్న పుష్పలతకు.. రాజా అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్త కొంత కాలానికి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం కాస్త పుష్పలత తల్లి లక్ష్మి (48) తెలియడంతో... అతనికి దూరంగా ఉండాలని హెచ్చరించింది. అయితే, తమ ఏకాంతానికి తల్లి లక్ష్మి అడ్డుగా ఉందని భావించిన పుష్పలత.. ప్రియుడితో కలిసి ఆమెను అడ్డుతొలగించుకోవడానికి పథకం రచించింది.
ఓ రోజు ఇంట్లో నిద్రిస్తున్న తల్లి లక్ష్మిని ప్రియుడితో కలిసి హత్య చేసిన పుష్పలత.. ఇంట్లోని నగలు, నగదు తీసుకుని పరార్ అయ్యింది. ఆ సమయంలో కుమారుడి అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. లక్ష్మి హత్యకు సంబంధించి సమాచారం రావడంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. హత్యకు గలకారణాలపై ఆరా తీశారు.
https://x.com/RTVnewsnetwork/status/2099003958874481107?s=20
తన తల్లి, బాబాయి కలిసి అమ్మమ్మను హత్య చేశారని పుష్పలత కుమారుడు చెప్పడంతో పోలీసులు ఈ మేరకుకేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితులు వాడిన మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేస్తున్నట్టు సమాచారం. కాగా,ఒంటరిగా మిగిలిన బాలుడిని బంధువులకు అప్పగించినట్టు తెలుస్తోంది.









