ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) మానవాళికి తీవ్రమైన ప్రమాదంగా మారగలదా? ఏఐ వల్ల మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందా? అనే అంశంపై ప్రముఖ ఏఐ పరిశోధన సంస్థ 'ఆంత్రోపిక్' (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకంతకూ శక్తివంతమవుతున్న ఏఐ సాంకేతికత వల్ల భవిష్యత్తులో తలెత్తే పరిణామాలపై ఆయన స్పందిస్తూ స్పష్టమైన సూచనలు చేశారు. మనం సరైన భద్రతా మార్గాన్ని ఎంచుకుంటే ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని, ఒకవేళ తప్పుడు మార్గాన్ని ఎన్నుకుంటే మానవాళికి ఏఐ వల్ల ఎదురయ్యే ముప్పు ఊహించలేనంత భయంకరంగా మారుతుందని హెచ్చరించారు.
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో తగిన భద్రతా చర్యలను (Safety Protocols) తక్షణమే అమలు చేయాల్సిన అవసరం ఉందోనని డారియో అమోడెయ్ అభిప్రాయపడ్డారు. సాంకేతికత పురోగతి వేగాన్ని కొంతమేర తగ్గించి, దాని సురక్షిత వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఇటీవల ఆంత్రోపిక్ సంస్థ నుంచి రాజీనామా చేసిన మాజీ పరిశోధకుడు జాకబ్ స్టెయిన్‌హార్ట్ ఏఐ వల్ల మానవాళికి కలిగే ప్రమాదాలపై తీవ్ర ఆందోళన లేవనెత్తిన విషయం తెలిసిందే. ఏఐ మనుషులను చంపగలదా? అనే ప్రశ్నకు స్పందిస్తూ, తాను కూడా స్టెయిన్‌హార్ట్ లేవనెత్తిన భయాలు, ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు డారియో వెల్లడించారు.
ఏఐ టెక్నాలజీ భవిష్యత్తు ఫలితాలు అనేది అంతిమంగా అంతర్జాతీయ ప్రభుత్వాలు, టెక్ కంపెనీలు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుందని డారియో స్పష్టం చేశారు. ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ రెండింటిలోనూ పనిచేసిన మరో ప్రముఖ ఏఐ పరిశోధకుడు జాకబ్ జాక్సన్ కూడా ఇటీవల కంపెనీలకు రాజీనామా చేశారు. మరింత శక్తివంతమైన వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేసే క్రమంలో ప్రముఖ ఏఐ కంపెనీలు ఆమోదయోగ్యం కాని స్థాయిలో రిస్క్‌లు తీసుకుంటున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. రాబోయే రోజుల్లో అధునాతన ఏఐ వ్యవస్థలు మానవాళి ఉనికికే ముప్పుగా పరిణమిస్తాయని హెచ్చరించారు.
ఈ విమర్శలు, ఆందోళనల నేపథ్యంలో ఏఐ రంగంలో భద్రతా ప్రమాణాలు పాటించడంపై తీవ్ర చర్చ మొదలైంది. లాభాపేక్ష, పోటీ మాత్రమే కాకుండా పర్యావరణం, మానవ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఏఐ మోడళ్లను నియంత్రించాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, టెక్ దిగ్గజాలు తప్పుడు మార్గాల కంటే సరైన సురక్షిత మార్గాలను ఎంచుకోవడం ద్వారానే ఏఐ వల్ల కలిగే ముప్పును నివారించవచ్చని ఆంత్రోపిక్ అధినేత స్పష్టం చేశారు.








