తెలంగాణ

ఎల్బీ స్టేడియంలో జీహెచ్ఎంసీ కార్మికుల బంధీ.. తిండి, నీళ్లు లేక బాధితుల ఆవేదన!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్త సేకరణ బాధ్యతలను 'రాంకీ' అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన స్వచ్ఛ ఆటో, చెత్త సేకరణ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని ఎల్బీ స్టేడియంలో బంధించడం తీవ్ర కలకలం రేపింది. తమ ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మండిపడుతూ కార్మికులు ఆందోళనకు దిగగా, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేడియం ప్రాంగణానికి తరలించారు.

 జీహెచ్‌ఎంసీ పరిధిలో చెత్త సేకరణ బాధ్యతలను 'రాంకీ' అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించడాన్ని నిరసిస్తూ ఆందోళన బాట పట్టిన స్వచ్ఛ ఆటో, చెత్త సేకరణ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని ఎల్బీ స్టేడియంలో బంధించడం తీవ్ర కలకలం రేపింది. తమ ఉపాధిని దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మండిపడుతూ కార్మికులు ఆందోళనకు దిగగా, వారిని బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేడియం ప్రాంగణానికి తరలించారు. ఈ అనూహ్య చర్యతో నగరంలో జీహెచ్‌ఎంసీ శానిటేషన్ విభాగానికి చెందిన ప్రైవేట్, ఒప్పంద కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 స్టేడియంలో బంధించిన కార్మికులతో అధికారులు ప్రవర్తిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బంధించిన తమకు కనీస మానవీయ విలువలైనా పాటించకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పందులు కూడా ముట్టుకోని రీతిలో ఉన్న చల్లారిన అన్నం, నీళ్లలాంటి పప్పు పెట్టి మమ్మల్ని ఇక్కడ బంధించారు’ అని కార్మికులు కన్నీటిపర్యంతమయ్యారు. మంచినీటి సదుపాయం, ప్రాథమిక వసతులు కూడా సరిగా కల్పించకుండా పోలీసులు తమను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని ఆందోళనకారులు ఆరోపించారు.

 గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ హయాంలో తీసుకున్న నిర్ణయాలను ఈ సందర్భంగా కార్మికులు గుర్తు చేసుకున్నారు. ‘సొంతగా స్వచ్ఛ ఆటో బండ్లు కొనిచ్చి, లోన్లు అందించి కేసీఆర్ మమ్మల్ని ఓనర్లుగా నిలబెడితే.. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం చెత్త సేకరణ కాంట్రాక్టులను బడా ప్రైవేట్ సంస్థకు అప్పగించి మా బతుకులను రోడ్డుపాలు చేస్తోంది’ అని ధ్వజమెత్తారు. శ్రమదానంతో నగరాన్ని శుభ్రంగా ఉంచే తమ పొట్ట కొట్టి, కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చడం ఏమాత్రం తగదని వారు నిలదీశారు.

 తమకు కేటాయించిన రూట్లను, చెత్త సేకరణ హక్కులను వెంటనే పునరుద్ధరించాలని, అదేవిధంగా ప్రైవేట్ సంస్థకు ఇచ్చిన కాంట్రాక్టును రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఎల్బీ స్టేడియం నుంచి తమను వెంటనే విడుదల చేయకపోతే, నగరం వ్యాప్తంగా చెత్త సేకరణ సేవలను నిలిపివేసి పెద్దఎత్తున నిరసన బాట పడతామని హెచ్చరించారు. ప్రభుత్వ తీరుపై హెచ్‌ఎంఎస్, ఆర్టీసీ-జీహెచ్‌ఎంసీ కార్మిక సంఘాలు మద్దతు తెలపడంతో నిరసన కాస్త నగరంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

#GHMCWorkers#LBStadium#RamkyContract#SwachhAutoWorkers#TelanganaNews#HyderabadProtest#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి