తెలంగాణ

మా భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే పడుతుంది- సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

7 నిమిషాల పఠనం

Kukatpally Lands: కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూముల విక్రయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. భూముల వేలం ఆలోచన మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన.

Kukatpally Lands: కూకట్‌పల్లిలో ప్రభుత్వ భూముల విక్రయంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఫైర్ అయ్యారు. భూముల వేలం ఆలోచన మానుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. కేపీహెచ్ బీ భూములను తన నియోజకవర్గంలోని ప్రజల అవసరాల కోసమే కేటాయించాలన్నారు. కూకట్ పల్లి భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే మీకూ పడుతుందని సీఎం రేవంత్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

2వేల కోట్ల విలువైన భూముల విక్రయం

కూకట్ పల్లి, మూసాపేట ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల వేలం, విక్రయాలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన ర్యాలీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కలిసి పేదల భూములు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కూకట్ పల్లిలో ఇప్పటికే దాదాపు 2వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు శాపంగా మారిందని ధ్వజమెత్తారు.

50 ఎకరాలు పేదలకు పంచాం

కూకట్‌పల్లి, మూసాపేటల్లోని భూములను ఎమ్మెల్యే మాధవరం పరిశీలించారు. భవిష్యత్తులో ప్రజల కోసం, పేదల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన భూములను వేలం వేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రమ్య గ్రౌండ్ దగ్గర ఉన్న స్థలాన్ని స్కూల్ కి, ఫిష్ మార్కెట్ దగ్గర ఉన్న భూమిని పెట్రోల్ బంక్ కి కేటాయించాలన్నారు మాధవరం కృష్ణారావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 50 ఎకరాల భూమిని పేదలకు పంచామని తెలిపారు. 10 లక్షల మంది జనాభా ఉన్న కూకట్ పల్లి నియోజకవర్గంలో పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్ కూడా లేదని వాపోయారు.

కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్.. ఏ ముఖ్యమంత్రి కూడా ట్రక్ పార్క్ అమ్మలేదు

''ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి, హౌసింగ్ బోర్డ్ వీసీ.. మా ప్రజల సొత్తు గజం గజం అమ్ముకుంటున్నారు. మా పిల్లలకు ఒక పార్కు కానీ, క్రికెట్ గ్రౌండ్ కానీ లేకుండా చేస్తున్నారు. అన్ని రకాలుగా భూములు అమ్ముకుంటున్నారు. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు భూములు అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని సీఎం రేవంత్ చూస్తున్నారు. రేవంత్ ను గెలిపించింది మా కూకట్ పల్లి ప్రజలే. 270 ఎకరాల ల్యాండ్ ను 22ఏలో పెట్టారు. మేము సుప్రీంకోర్టులో పోరాటం చేసి 22 ఎకరాల భూమిని కాపాడితే దాన్ని ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చాము. అందులో 5 ఎకరాలు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లకు ఇచ్చి మిగతా భూమిని అమ్మకానికి పెట్టారు. 40 ఏళ్ల నుంచి ట్రక్ పార్క్ 34 ఎకరాల భూమి మాదే. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్.. ఏ ముఖ్యమంత్రి కూడా ట్రక్ పార్క్ అమ్మలేదు. ఈ దుర్మార్గులు ఆ భూములు కూడా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు'' అని విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

మా భూముల జోలికి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతే పడుతుంది- సీఎం రేవంత్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వార్నింగ్

అన్ని పార్టీలు, ప్రజలు ఏకమై పోరాటాలు చేద్దాం

''కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మూడేళ్లైంది. 30 పైసల పని కూడా చేయలేదు. కానీ, లక్షల కోట్ల రూపాయలు దోచుకు తింటున్నారు. ప్రజల సొత్తును దోచుకు తింటున్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలంటే అన్ని పార్టీలు, ప్రజలు ఏకమవ్వాలి. ఐక్యంగా పోరాటాలు చేయాలి. రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా కూకట్ పల్లి కేపీహెచ్ బీ కాలనీకి చెందిన సుమారు 2వేల కోట్ల రూపాయల విలువైన భూములు అమ్ముకున్నారు. హౌసింగ్ బోర్డ్ భూముల విక్రయాన్ని ఇప్పటికైనా ఆపమని ముఖ్యమంత్రికి చేతులెత్తి నమస్కరిస్తున్నా.

బంగ్లాదేశ్ ప్రధానికి పట్టిన గతి తెచ్చుకోవద్దు

నాకు 40ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఐదుసార్లు గెలిచా. ప్రజల పక్షాన ఉంటా. మొండిగా పోతాము, భూములు విక్రయిస్తాము అంటే ఊరుకునేది లేదు. ఈసారి వచ్చేది కచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. ప్రజల సొత్తు కొనుగోలు చేసిన ఎవడైనా డ్రామాలు ఆడితే.. రేపు మా ప్రభుత్వం వచ్చాక.. పునాదులతో సహా పెకిలిస్తాం. ఆ భూములను ప్రజలకు అంకితం చేస్తాం. ఇక్కడ భూములు కొనే వాళ్లకు కూడా చెబుతున్నా. మీరు ఇక్కడి కమర్షియల్ బిట్స్ కొంటే మీ వెంట పడతా. ట్రక్ పార్క్, హౌసింగ్ బోర్డ్ ల్యాండ్ ను అమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలంతా రోడ్డు మీదకు వస్తే.. బంగ్లాదేశ్ లో ఏ రకంగా ప్రధాని ఉరికారో.. ఆ గతి తెచ్చుకోద్దు'' అని సీఎం రేవంత్ ను హెచ్చరించారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

#Kukatpally Lands#BRS#Madhavaram Krishna Rao#Congress Govt#Cm Revanth#KPHB Lands#Moosapet#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి