తెలంగాణ

Project Baata: మేడిగడ్డ సాక్షిగా కేటీఆర్ ‘ప్రాజెక్ట్ బాట’.. కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా గులాబీ పార్టీ బిగ్ స్కెచ్!

7 నిమిషాల పఠనం

Project Baata: తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో మరోసారి 'కాళేశ్వరం' సెంట్రిక్ వార్ మొదలుకాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతూ వస్తోంది.

Project Baata: తెలంగాణ రాజకీయ రణక్షేత్రంలో మరోసారి 'కాళేశ్వరం' సెంట్రిక్ వార్ మొదలుకాబోతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటును ప్రధాన అస్త్రంగా మార్చుకుని బీఆర్ఎస్‌ను ఇరుకున పెడుతూ వస్తోంది. అయితే, ఈ ఆరోపణలను ఇకపై కేవలం ప్రెస్‌మీట్లతోనో, సోషల్ మీడియా ట్వీట్లతోనో తిప్పికొట్టడం సరిపోదని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. తమ మానసపుత్రికగా చెప్పుకునే ప్రాజెక్టు వేదికగానే కాంగ్రెస్ సర్కార్‌కు చెక్ పెట్టేందుకు సరికొత్త పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది.

మేడిగడ్డ నుంచే సమరశంఖం..

కాంగ్రెస్ విమర్శల తీవ్రతను తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ‘ప్రాజెక్ట్ బాట’ పేరిట ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మొదలయ్యే ఈ బస్సు యాత్ర.. మిడ్ మానేరు లేదా లోయర్ మానేరు డ్యామ్ వరకు 2 నుంచి 3 రోజుల పాటు సాగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతో పాటు కాళేశ్వరం పంప్‌హౌస్‌లు, టన్నెళ్లను కేటీఆర్ స్వయంగా పరిశీలిస్తారు.

కేవలం చూసి వెళ్లడమే కాకుండా, ప్రాజెక్ట్ పరిసర ప్రాంతాల్లోని రైతులతో నేరుగా ‘రచ్చబండ’ సమావేశాలు నిర్వహించి, గతంలో కాళేశ్వరంతో అందిన నీళ్లు.. ఇప్పుడు ప్రభుత్వం సరిగా నిర్వహించకపోవడం వల్ల ఎదురవుతున్న సాగునీటి కష్టాలపై ప్రజలతో మాట్లాడనున్నారు.

పాదయాత్ర డ్రాప్.. బస్సు యాత్రకే మొగ్గు ఎందుకు?

వాస్తవానికి క్షేత్రస్థాయిలో ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు కేటీఆర్‌తో పాదయాత్ర చేయించాలని మొదట భావించారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల గుండా పాదయాత్ర సాగించి, జనావాసాలు లేని సుదూర ప్రాంతాల్లో మాత్రమే వాహనాలు వాడేలా ప్లాన్ చేశారు. అయితే, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆరోపణలను అంతే వేగంగా తిప్పికొట్టాలంటే దూకుడుగా సాగే బస్సు యాత్రే సరైన వ్యూహమని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్ర సమన్వయ బాధ్యతలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు అప్పగించగా.. క్షేత్రస్థాయి పరిశీలన, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే కార్యచరణ రూపకల్పన బాధ్యతలను పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

కంచుకోటలోనే కౌంటర్ అటాక్.. అసలు లక్ష్యం అదే!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఒకప్పుడు గులాబీ పార్టీకి తిరుగులేని కంచుకోట. అలాంటి చోట గత శాసనసభ ఎన్నికల్లో 13 స్థానాల్లో బీఆర్ఎస్ కేవలం 5 స్థానాలకే పరిమితమై, ఏకంగా 8 స్థానాలను కోల్పోయింది. లక్ష కోట్ల రూపాయలతో కట్టిన ప్రాజెక్టు వృథా అయిందంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారమే ఉత్తర తెలంగాణలో పార్టీ దెబ్బతినడానికి ప్రధాన కారణమని బీఆర్ఎస్ విశ్లేషించుకుంది.

అందుకే "ఎక్కడైతే పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలి" అన్న సూత్రంతో కేటీఆర్ గ్రౌండ్‌లోకి దిగుతున్నారు. కాళేశ్వరం అవసరాన్ని, దాని ద్వారా ఉత్తర తెలంగాణ సస్యశ్యామలమైన తీరును ప్రజలకు వివరిస్తూనే.. అసెంబ్లీలో కాంగ్రెస్ పెట్టబోయే చర్చకు ముందే ప్రజాక్షేత్రంలో మైలేజ్ సాధించాలన్నది బీఆర్ఎస్ అసలు స్కెచ్‌గా కనిపిస్తుంది.

నవంబర్ 29 'దీక్షా దివస్'తో పొలిటికల్ క్లైమాక్స్!

బస్సు యాత్రతో కేడర్‌లో ఉత్సాహం నింపడంతో పాటు, తెలంగాణ ఉద్యమ చరిత్రలో మైలురాయిగా నిలిచిన నవంబర్ 29 'దీక్షా దివస్'ను కరీంనగర్ వేదికగా అత్యంత భారీ ఎత్తున నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కరీంనగర్‌లోనే చారిత్రక నిరాహార దీక్షకు పూనుకున్న సందర్భాన్ని గుర్తుచేస్తూ, భారీ బహిరంగ సభ ద్వారా లక్షలాది మందితో జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్ సంధిస్తున్న అస్త్రాలను తిప్పికొట్టడమే కాకుండా.. కుదేలైన క్యాడర్‌లో కొత్త జోష్ నింపి, ఉమ్మడి కరీంనగర్‌లో పూర్వవైభవాన్ని సాధించేందుకు మేడిగడ్డ సాక్షిగా కేటీఆర్ మొదలుపెడుతున్న ఈ ‘ప్రాజెక్ట్ బాట’ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

#Project Baata#KTR#BRS#Bharat Rashtra Samithi#Medigadda Barrage#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి