Trump Impeachment: మిడ్‌టర్మ్ ఎన్నికల్లో తగిలిన ఊహించని ఎదురుదెబ్బ మరువకముందే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో రాజకీయ సంక్షోభం ముంచుకొస్తోంది. ఇన్నాళ్లూ వివాదాస్పద నిర్ణయాలతో పాలన సాగించిన ట్రంప్‌కు ఈసారి ఎలాగైనా బ్రేకులు వేయాలని డెమోక్రాట్లు డిసైడ్ అయ్యారు. చట్టసభల్లో సాధించిన పూర్తి మెజారిటీని ఆయుధంగా మలచుకుని, ట్రంప్ పీఠానికే ఎసరు పెట్టేలా ‘మూడో అభిశంసన’ అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నారు.
లక్ష్యం ఒక్కటే..
గతంలో ట్రంప్ తన మొదటి పదవీకాలంలో రెండుసార్లు అభిశంసన తీర్మానాలను ఎదుర్కొన్నారు. అయితే అప్పట్లో సెనెట్‌లో రిపబ్లికన్లకు సంఖ్యాబలం ఉండటంతో అవి వీగిపోయి ట్రంప్ బయటపడ్డారు. కానీ ప్రస్తుత సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. చట్టసభల్లో డెమోక్రాట్ల ఆధిపత్యం పెరగడంతో ఈసారి ఆయన్ను అధ్యక్ష పదవి నుంచి తప్పించేలా పూర్తిస్థాయి అభిశంసన ప్రక్రియకు గ్రౌండ్‌వర్క్ మొదలుపెట్టారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ట్రంప్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు లబ్ధి పొందారన్న ఆరోపణలను డెమోక్రాట్లు గట్టిగా తెరపైకి తెస్తున్నారు.
దర్యాప్తునకు సిద్ధమైన కీలక అంశాలు ఇవే..
కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ కమిటీల ద్వారా ట్రంప్ సర్కార్‌ను ఉక్కిరిబిక్కిరి చేసేందుకు పలు సంచలన అంశాలను సిద్ధం చేశారు. ట్రంప్ కుటుంబ సభ్యుల రహస్య వ్యాపార ఒప్పందాలు. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ సంస్థలు సాగించిన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం, క్రిప్టోకరెన్సీ డీల్స్. తీవ్ర దుమారం రేపిన జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించిన అంశాల పునర్విచారణ. ఐసీఈ పేరిట విచక్షణారహితంగా వలసదారులపై సాగించిన దాడుల వ్యవహారంపై విచారణ జరపడానికి రెడీ అవుతున్నారు.
డెమోక్రాట్ల చేతిలో ‘సబ్‌పీనా’ బ్రహ్మాస్త్రం!
చట్టసభల్లో మెజారిటీ రావడంతో కీలక కమిటీలన్నీ డెమోక్రాట్ల చేతుల్లోకి వచ్చాయి. దీనివల్ల వారికి ‘సబ్‌పీనా’ అధికారం లభించింది. ఈ అధికారంతో అధ్యక్షుడు, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులను కమిటీల ఎదుట స్వయంగా హాజరుకావాలని ఆదేశించవచ్చు. సంబంధిత పత్రాలు, రహస్య సమాచారాన్ని బయటపెట్టాలని ఒత్తిడి తీసుకురావచ్చు. ఈ లీగల్ అస్త్రాన్ని ఉపయోగించి ట్రంప్ పాలనలోని అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టేందుకు డెమోక్రాట్లు పక్కాగా వ్యూహం రచిస్తున్నారు.
ట్రంప్ రియాక్షన్ వైరల్..
ఈ పరిణామాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. మూడోసారి అభిశంసన ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయం తనకు లేశమాత్రమైనా లేదని స్పష్టం చేశారు. "దేశాన్ని ఎంతో విజయవంతంగా నడుపుతున్నందుకా నన్ను అభిశంసించేది?" అని నిలదీశారు. అదే సమయంలో డెమోక్రాట్లకు గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. "డెమోక్రాట్లు సహకరిస్తే వారితో కలిసి పని చేసేందుకు నేను సిద్ధం. అలా కాకుండా విద్వంసకర వైఖరితో ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తే.. నాకున్న తిరుగులేని ‘వీటో’ అధికారాలను ప్రయోగిస్తా అని హెచ్చరించారు.
డెమోక్రాట్లు సంధించే విచారణల అస్త్రాలను ట్రంప్ తన వీటో పవర్‌తో ఎలా ఎదుర్కొంటారు? ఈ హోరాహోరీ రాజకీయ సమరంలో ట్రంప్ మూడోసారి అభిశంసనకు గురవుతారా లేదా? అన్నది ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది.


