దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎస్‌బీఐ డెబిట్ కార్డును ఉపయోగించి ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచితంగా నగదు ఉపసంహరించుకునే వెసులుబాటును ఎస్‌బీఐ సవరించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో ఉచిత లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కు తగ్గించారు.
ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచే అమల్లోకి రానున్నాయి. పరిమితి దాటిన తర్వాత చేసే ప్రతి విత్‌డ్రాయల్‌పై సర్వీస్ ఛార్జీలు వర్తిస్తాయిని ఎస్‌బీఐ పేర్కొంది.. ప్రస్తుతం ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంలు, డిపాజిట్ కమ్ విత్‌డ్రా మెషిన్ల (ADWM) ద్వారా నెలకు మొదటి 10 లావాదేవీలను ఉచితంగా పొందుతున్నారు. ఇక ఈ ఐదు లావాదేవీలు ముగిన తర్వాత జరిపే ఆరో ట్రాన్సాక్షన్ నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది.
ఈ పరిమితులు ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలకూ వర్తిస్తుందని బ్యాంకు అధికారులు ప్రకటించారు.. ఇక పరిమితి దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అదనంగా చేసే ప్రతి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌పై అంటే నగదు ఉపసంహరణపై రూ. 23తో పాటు జీఎస్‌టీ వసూలు చేయనుంది. అలాగే బ్యాలెన్స్ చెక్, పిన్ చేంజ్ వంటి నాన్-ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లపై రూ. 11 ప్లస్ జీఎస్‌టీ ఛార్జీలు పడనున్నాయి.
అయితే ఈ కొత్త నిబంధనలు కేవలం ఎస్‌బీఐ శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు మాత్రమే వర్తిస్తాయని, ఇతర సాధారణ ఎస్‌బీఐ ఖాతాదారులకు ఇవి వర్తించవని పేర్కొంది. అదేవిధంగా, ఎస్‌బీఐకి చెందిన సొంత ఏటీఎంలు లేదా ఏడీడబ్ల్యూఎంలలో జరిపే డెబిట్ కార్డ్ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న పరిమితులు, ఛార్జీలే కొనసాగుతాయి. అందులో బ్యాంక్ ఎలాంటి మార్పూ చేయలేదని ఎస్‌బీఐ వెల్లడించింది.









