Konda Surekha: క్యాబినెట్ నుంచి తనను బర్తరఫ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంపై కొండా సురేఖ స్పందించారు. బర్తరఫ్ చేయడాన్ని ఆమె ఖండించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనను బర్తరఫ్ చేశారని వాపోయారు. నిర్ణయానికి ముందు నా వివరణ తీసుకోవాల్సిందన్నారు.
నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను ఎలా బాధ్యురాలిని చేస్తారని మరోసారి కొండా సురేఖ ప్రశ్నించారు. నా కూతురు స్వతంత్ర మహిళ, ఆమె వ్యాఖ్యలు ఆమెవే అని తేల్చి చెప్పారు. నా కూతురు వ్యాఖ్యలను నేను ఖండించాల్సిన అవసరం లేదన్నారు. తన కుమార్తె వ్యక్తిగత అభిప్రాయాన్ని తప్పుపట్టే అధికారం తనకు లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబసభ్యులతో మాట్లాడి భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం ప్రకటిస్తానన్నారు కొండా సురేఖ. తనపై కక్షపూరితంగా చర్యలు తీసుకున్నారని భావిస్తున్నానని కొండా సురేఖ తెలిపారు.
''పదేళ్లుగా నా కూతురు టికెట్ కోసం ప్రయత్నిస్తోంది. కడియం శ్రీహరి తన కూతురిని ఎంపీ చేసుకున్నారు. డీఎస్ ఇంట్లో రెండు పార్టీలు ఉన్నాయి.
భవిష్యత్ కార్యాచరణపై ఇంకా ఆలోచంచుకోలేదు. నా వల్ల ముగ్గురు బీసీ మహిళలకు పదవులు రావటం సంతోషకరం. నా కోసం చిన్నారెడ్డిపై వేటు వేయడం సరికాదు. జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఏం నిర్ణయం తీసుకున్నారు? రాజీనామా చేయమని నన్ను ఎవరూ అడగలేదు. నా వివరణ వినకుండా నేరుగా తొలగించడం సరికాదు. అధిష్టానానికి నేను ఇచ్చిన లేఖను మీడియాకు ఇస్తున్నా'' అని కొండా సురేఖ తెలిపారు.








