National

మేరా భార‌త్ మ‌హాన్.. స్వాతంత్ర దినోత్స‌వం స్పెష‌ల్!

రచన: Kashi••7 నిమిషాల పఠనం

1947లో ఒక తరం మనకు స్వేచ్ఛను ఇచ్చింది. 2047లో మనం తర్వాతి తరానికి ఏం ఇవ్వబోతున్నాం? అదే ప్రశ్న. అదే మన బాధ్యత. అదే ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు ఇచ్చే అసలైన సందేశం.

ఆగస్టు 15... క్యాలెండర్‌లో ఒక తేదీ కాదు. అది ఒక జాతి జ్ఞాపకం. ఒక తరం త్యాగం. ఒక దేశం పునర్జన్మ. ప్రతి ఏటా త్రివర్ణ పతాకం ఆకాశంలో రెపరెపలాడినప్పుడు.. ఆ మూడు రంగుల వెనుక దాగిన కోట్లాది త్యాగాల కథ మన కళ్ల ముందు కదలాడుతుంది.

అయితే ఈ ఏడాది ఆగస్టు 15కి ఒక ప్రత్యేకత ఉంది. 2026లో భారత్ 80వ స్వాతంత్ర‌ దినోత్సవాన్ని జరుపుకుంటోంది. అంటే స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో దశాబ్దంలోకి అడుగుపెట్టిన భారతదేశం.. ఇప్పుడు తన గతాన్ని చూసుకోవడమే కాదు.. తన భవిష్యత్తును కూడా ప్రశ్నించుకోవాల్సిన సమయం వచ్చింది.

1947లో మనకు స్వాతంత్రం వ‌చ్చింది.. కానీ వనరులు తక్కువ. 2026లో మన దగ్గర వనరులు ఉన్నాయి.. మరి మన సంకల్పం ఉందా..? 2047లో మనం ఎక్కడ ఉండాలి? ఇదే ఈ స్వాతంత్ర దినోత్సవం మన ముందు ఉంచుతున్న అసలు ప్రశ్న.

1947... ఒక వైపు స్వేచ్ఛా సూర్యోదయం. మరోవైపు విభజన చీకట్లు. ఆకలి, పేదరికం, నిరక్షరాస్యత, మౌలిక వసతుల కొరత.. ఎన్నో సవాళ్ల మధ్య భారత్ తన తొలి అడుగు వేసింది. అప్పుడు మన పూర్వీకుల దగ్గర పెద్దగా ఆస్తులు లేకపోవచ్చు. ఆధునిక సాంకేతికత లేకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం ఉంది...

“హమ్ కర్ సక్తే హైం” అనే విశ్వాసం. అదే విశ్వాసంతో ఒక దేశం నడక మొదలుపెట్టింది. కాలం మారింది. తరాలు మారాయి. భారత్ కూడా మారింది. పచ్చని విప్లవం నుంచి అంతరిక్ష విప్లవం వరకు.. కంప్యూటర్ నుంచి కృత్రిమ మేధ వరకు.. బ్యాంకింగ్ నుంచి డిజిటల్ చెల్లింపుల వరకు.. ప్రపంచం వేగంగా మారుతున్న ప్రతి దశలో భారత్ తన ముద్ర వేస్తోంది. ఒకప్పుడు ప్రపంచం వైపు ఆశగా చూసిన దేశం.. ఇప్పుడు ప్రపంచం తనవైపు చూసే స్థాయికి చేరుకుంటోంది.

కానీ...

దేశం ఎత్తైన భవనాలతో మాత్రమే ఎదగదు.

దేశం పొడవైన రహదారులతో మాత్రమే అభివృద్ధి చెందదు.

దేశం బలమైన ఆర్థిక వ్యవస్థతో మాత్రమే మహాశక్తి కాదు.

దేశం ఎదగాలంటే.. ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య ఉండాలి. ప్రతి యువకుడికి అవకాశాలు రావాలి. ప్రతి రైతుకు గౌరవం ద‌క్కాలి. ప్రతి మహిళకు భద్రత ఉండాలి. ప్రతి పౌరుడికి సమానమైన అవకాశాలు ఉండాలి.

అందుకే 2047 అనే సంవత్సరం కేవలం ఒక తేదీ కాదు. అది ఒక లక్ష్యం. ఒక సంకల్పం. ఒక పరీక్ష. స్వాతంత్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి భారత్ ఎలా ఉండాలి?

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండాలా? సాంకేతికతలో అగ్రగామిగా నిలవాలా? యువతకు ప్రపంచస్థాయి అవకాశాలు కల్పించాలా? పేదరికాన్ని మరింతగా తగ్గించాలా?

ప్రతి భారతీయుడు గర్వంగా “యే మేరా భారత్ హై” అని చెప్పుకునే దేశంగా మార్చాలా?

సమాధానం ఒక్కటే కాదు. కానీ ఆ సమాధానాన్ని రాసేది మాత్రం మనమే. ఎందుకంటే 2047లో భారత్‌ను చూసే తరానికి.. ఈరోజు మనం తీసుకునే నిర్ణయాలే వారసత్వంగా మిగులుతాయి.

ఈరోజు పాఠశాల గేటు దాటుతున్న ఒక చిన్నారి.. 2047లో దేశాన్ని నడిపించే శాస్త్రవేత్త కావచ్చు.

ఈరోజు స్టార్టప్ మొదలుపెడుతున్న యువకుడు.. రేపటి ప్రపంచ మార్కెట్‌ను ప్రభావితం చేసే వ్యాపారవేత్త కావచ్చు. ఈ రోజు పుస్తకం పట్టుకున్న విద్యార్థి.. రేపటి విధాన నిర్ణేత కావచ్చు.

అందుకే ఈసారి స్వాతంత్ర‌ దినోత్సవ సందేశంలో యువశక్తికి ప్రత్యేక స్థానం. “యువ శక్తి ప‌ర్ వికసిత్ భారత్@2047” అనే ఆలోచన.. భవిష్యత్ భారత నిర్మాణంలో యువతే అసలైన శక్తి అని గుర్తుచేస్తోంది.

ఇదే సమయంలో మరో చారిత్రక సందర్భం కూడా మన ముందుంది. ‘వందే మాతరం’కు 150 ఏళ్లు. స్వాతంత్ర‌ పోరాటంలో ఒక గేయంగా మొదలైన ఆ పదాలు.. ఒక దశలో కోట్లాది భారతీయుల గుండెల్లో జోష్ నింపిన నినాదంగా మారాయి. “వందే మాతరం” అంటే కేవలం రెండు పదాలు కాదు.

అది మాతృభూమికి వందనం. త్యాగానికి స్మరణ. స్వేచ్ఛకు ప్రతిజ్ఞ. 150 ఏళ్ల తర్వాత కూడా ఆ పదాలు వినిపిస్తున్నాయంటే.. వాటిలో ఉన్న భావం కాలాన్ని దాటిందనే అర్థం.

అందుకే 2026 ఆగస్టు 15న త్రివర్ణ పతాకం పైకి ఎగిరినప్పుడు.. మనం కేవలం గతాన్ని గుర్తుచేసుకోవద్దు. ఒక్కసారి భవిష్యత్తు వైపు కూడా చూడాలి.

1947 మనకు స్వాతంత్రాన్ని ఇచ్చింది.

2026 మన ప్రయాణాన్ని గుర్తు చేస్తోంది.

2047 మన సామర్థ్యాన్ని పరీక్షించబోతోంది.

ఆ పరీక్షలో భారత్ ఏ స్థానం సాధిస్తుందో.. కేవలం ఢిల్లీలో తీసుకునే నిర్ణయాలు నిర్ణయించవు. మన ఇళ్లలో తీసుకునే నిర్ణయాలు కూడా కీల‌క పాత్ర పోషిస్తాయి. మన పిల్లలకు ఇచ్చే విద్య నిర్ణయిస్తుంది. మన యువత ఎంచుకునే మార్గం నిర్ణయిస్తుంది. మన సమాజం చూపించే బాధ్యత నిర్ణయిస్తుంది.

దేశాన్ని మార్చేది ఒక్క నాయకుడు కాదు. ఒక్క ప్రభుత్వం కాదు. ఒక్క తరం కూడా కాదు. దేశాన్ని మార్చేది.. కోట్లాది ప్ర‌జ‌ల కల. ఆ కల కోసం చేసే కోట్ల కొద్దీ చిన్న చిన్న ప్రయత్నాలు. అందుకే ఈ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఒక కొత్త సంకల్పం తీసుకుందాం.

“ఆజాదీ మనకు వారసత్వంగా వచ్చింది.. వికసిత్ భారత్ మన బాధ్యతగా మారాలి.”

1947లో ఒక తరం మనకు స్వేచ్ఛను ఇచ్చింది. 2047లో మనం తర్వాతి తరానికి ఏం ఇవ్వబోతున్నాం?

అదే ప్రశ్న. అదే మన బాధ్యత. అదే ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు ఇచ్చే అసలైన సందేశం.

#India Independence Day 2026#80th Independence Day#Independence Day India#August 15 2026#India 2047#Viksit Bharat 2047#Yuva Shakti#Youth Power India#Vande Mataram#Indian Independence#Future of India#Developed India#India Development#Independence Day Special#Indian Youth
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి