హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ.. హెచ్ఎండీఏలో ఒక అధికారిణి వ్యవహారశైలిపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. శంకర్పల్లి జోన్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న తహసీల్దార్ కె. మాధవి రెడ్డిని చుట్టుముడుతున్న ఆరోపణలు పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అక్టోబర్ 9 నుంచి 17 వరకు విధులకు గైర్హాజరయ్యారని, అనుమతి లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు, విదేశాల్లో ఉన్న సమయంలోనూ కార్యాలయంలో హాజరు నమోదైందనే ప్రచారం కలకలం రేపుతోంది. ముఖ్యంగా బయోమెట్రిక్ హాజరు వివరాలు, సెలవుల మంజూరు ఉత్తర్వులు, విదేశీ పర్యటన అనుమతి పత్రాలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది. మరోవైపు భూ వినియోగ మార్పు ఫైళ్ల క్లియరెన్స్‌కు సంబంధించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు కూడా మాధవి రెడ్డిపై ఉన్నాయి..
గతంలో బాలాపూర్ మండలంలో పనిచేసిన సమయంలోనూ మాధవి రెడ్డి పై ఫిర్యాదులు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. విజిలెన్స్ విచారణకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయనే వాదనలు ఇక్కడ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఫిర్యాదు వెళ్లినా.. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ ఫిర్యాదుపై ముఖ్యమంత్రి హెచ్ఎండీఏ కమిషనర్‌ను వివరణ కోరినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు, రాజకీయ అండదండల కారణంగానే అధికారిని పై చర్యలు ఉండటం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. విధుల సమయంలో వ్యక్తిగత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారనే విమర్శలూ ఉన్నాయి.
మరోవైపు ఇంతటి కీలకమైన సంస్థలో పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉన్నతాధికారుల పాత్రపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాజరు, సెలవులు, ఫైళ్ల పరిష్కారం, ఫిర్యాదులపై పర్యవేక్షించాల్సిన యంత్రాంగం ఏం చేస్తోంది? హెచ్ఎండీఏ కమిషనర్ ఈ ఆరోపణలపై సమీక్ష చేపట్టారా? సంబంధిత అధికారిణి నుంచి వివరణ కోరారా? అనే అంశాలు తెరపైకి వస్తున్నాయి..


