రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నడుమ తీవ్ర మాటల యుద్ధం నడుస్తోంది. 22 ఏ విషయంలో మాజీ మంత్రి హరీశ్ రావు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని కార్నర్ చేశారు. ప్రజలు, రైతులకు చెందిన పట్టా భూములను నిషేధితా జాబితాలో ఎందుకు పెట్టారు? వాటిని విడిపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, కమీషన్ల కోసమే సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి ఈ దందాకు తెరలేపారని మాజీ మంత్రి ఆరోపించారు. అయితే, హరీశ్ రావు వ్యాఖ్యలకు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
పదవులు, డబ్బుల కోసమే మాజీ మంత్రి హరీశ్ రావు ఎంత నీచానికైనా దిగజారి రాజకీయం చేస్తున్నారని మంత్రి పొంగులేటి విమర్శించారు. బీఆర్ఎస్‌ను కబ్జా చేసేందుకు హరీశ్ రావు మరింతగా దిగజారారని ఫైర్ అయ్యారు. మామ కేసీఆర్ ఆరోగ్యం బాగుండకూడదని క్షుద్రపూజలు చేయించారని, ఈ విషయం స్వయంగా కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ప్రకటించారని, దీనిని బట్టి హరీష్ వ్యక్తిత్వం ఎంత నీచమైనదో అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు.
అలాంటి తప్పుడు మనస్తత్వం కలిగిన వ్యక్తి అయినందునే తన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు, రాజకీయ పబ్బం గడుపుకోవడానికి హరీశ్ రావు ప్రతిరోజూ అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు వాటిని నమ్మడం లేదన్నారు.ఆనాడు అగ్గిపెట్టె లేదంటూ యువకులను రెచ్చగొట్టి శవ రాజకీయాలు చేసిన ఆయన.. బీఆర్ఎస్ పవర్‌లో ఉన్నప్పుడు డబ్బుల కోసం మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని పాల వ్యాపారం చేశారని ఆరోపించారు.
ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా మంత్రి పొంగులేటి రియాక్ట్ అయ్యారు. ‘మామ కేసీఆర్‌పై క్షుద్రపూజలు, పాల పేరుతో చేసిన పాపపు వ్యాపారాల వంటి అవలక్షణాలు ఉన్న హరీశ్ రావు.. ఒక్కటి గుర్తుపెట్టుకో ఎన్ని కుట్రలు చేసినా, ప్రతి రోజూ పెయిడ్ సోషల్ మీడియాలో ఎన్ని తప్పుడు ప్రచారాలు చేయించినా ధరణి పేరుతో దొరలు చేసిన దోపిడీని బయటికి తీయడం ఖాయం. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి, పేదల సొంతింటి కలను నెరవేర్చడంతో పాటు గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడం కూడా ఖాయం. హరీశ్ రావు.. నీ కుట్రలు, ప్రజలకు మంచి చేయాలని, గొప్ప పరిపాలన అందించాలనే సీఎం నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వ సంకల్పాన్ని అడ్డుకోలేవు’ అని విమర్శించారు.












