హల్ద్వానీ ఘటనపై ప్రకంపనలు
కాంగ్రెస్–బీజేపీ మధ్య మాటల యుద్ధం..
అట్రాసిటీ చట్టం కింద కేసు పెట్టాలని రాహుల్ డిమాండ్..
రాజకీయ దుష్ప్రచారమంటున్న బీజేపీ
ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఓ బహిరంగ సభ వేదిక ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్న సభ ముగిసిన తర్వాత వేదికను ‘శుద్ధి’ చేశారన్న ఘటనపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది కేవలం ఒక వేదికకు సంబంధించిన వ్యవహారం కాదని.. దేశంలో కుల వివక్ష, అంటరానితనం వంటి అంశాలకు సంబంధించిన తీవ్రమైన విషయమని కాంగ్రెస్ వాదిస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం కాంగ్రెస్ కావాలనే ఈ అంశాన్ని వివాదంగా మారుస్తోందని ఆరోపిస్తోంది.
అసలు వివాదం ఏంటి?
ఈ నెల 8న హల్ద్వానీలో జరిగిన కాంగ్రెస్ సభలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సభ పూర్తయిన అనంతరం ఆ వేదిక వద్ద పూజ, శుద్ధి కార్యక్రమం నిర్వహించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాజకీయ వివాదం మొదలైంది.
వేదికను ఎందుకు శుద్ధి చేశారన్న ప్రశ్న చుట్టూనే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో.. ఆయన సభకు హాజరైన వేదికను శుద్ధి చేయడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా తప్పుబడుతోంది.
రాహుల్‌గాంధీ డిమాండ్ ఏంటి?
ఈ ఘటనపై రాహుల్‌గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఖర్గే పాల్గొన్న సభ వేదికను శుద్ధి చేయడం అంటరానితనాన్ని ప్రోత్సహించే చర్యగా ఆయన అభివర్ణించారు. ఇది ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఉల్లంఘించే ఘటనగా పేర్కొంటూ.. బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ తాను దేశంలోని అన్ని వర్గాలకు ప్రధానమంత్రినని చెబుతున్నారని.. అలాంటప్పుడు ఉత్తరాఖండ్‌లో జరిగిన ఈ ఘటనపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని రాహుల్ ప్రశ్నించారు. వేదిక ‘శుద్ధి’ని ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్ర భట్ సమర్థించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
ఇది కేవలం ఖర్గేకు జరిగిన అవమానం కాదని రాహుల్ స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి దళితుడికి సంబంధించిన అంశమని అన్నారు. రాజ్యాంగం అంటరానితనాన్ని నేరంగా పరిగణిస్తుందని గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అని ప్రశ్నించారు.
బీజేపీ కౌంటర్ ఏంటి?
కాంగ్రెస్ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసం రాహుల్‌గాంధీ సమాజాన్ని విభజించేలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు.
ఖర్గే సభ పూర్తయిన తర్వాత వేదిక అపరిశుభ్రంగా ఉండటంతో అక్కడ పూజ నిర్వహించామని బీజేపీ అధికార ప్రతినిధులు సుధాన్షూ త్రివేది, గురు ప్రకాశ్ పశ్వాన్ తెలిపారు. వేదిక పక్కనే ఆలయం కూడా ఉందని చెప్పారు. ఇందులో కుల వివక్షకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ కూడా కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్, ఖర్గేలు అబద్ధాలు చెప్పడంలో ముందుంటారని ఆరోపిస్తూ.. దళితులకు మోదీ ప్రభుత్వం అత్యున్నత గౌరవం కల్పిస్తోందని అన్నారు.
బంతి ఎవరి కోర్టులో?
హల్ద్వానీ వేదిక వివాదం ఇప్పుడు కేవలం రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలకే పరిమితం కాలేదు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న రాహుల్ డిమాండ్‌తో ఈ వ్యవహారం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఒకవైపు కాంగ్రెస్ దీనిని కుల వివక్షకు ప్రతీకగా చూపిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు బీజేపీ మాత్రం ఇది సాధారణ పూజా కార్యక్రమమని, దీనిని రాజకీయ వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని చెబుతోంది.
మరి హల్ద్వానీ వేదికపై నిజంగా ఏం జరిగింది? శుద్ధి కార్యక్రమం వెనుక ఉద్దేశం ఏమిటి? ఈ ఘటనపై కేసు నమోదవుతుందా? ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.












