National

నేపాల్ వరదల్లో ప్రిన్సిపాల్ సమయస్ఫూర్తి.. 1,643మంది విద్యార్థులు సేఫ్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు వేళ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదయం 9:20గంటల సమయంలో పాఠశాలలో 1,643మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగా ఎగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయని ప్రిన్సిపాల్‌కు ఫోన్ కాల్ వచ్చింది.

 నేపాల్‌లోని నువాకోట్ జిల్లా త్రిశూలి లోయలో ఉన్న శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడీ ప్రదర్శించిన అసాధారణ సమయస్ఫూర్తి విపత్తు వేళ వేలాది కుటుంబాల్లో వెలుగులు నింపింది. ఉదయం 9:20గంటల సమయంలో పాఠశాలలో 1,643మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉండగా ఎగువ ప్రాంతంలో ఆకస్మిక వరదలు వచ్చాయని ప్రిన్సిపాల్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ప్రారంభంలో మూడంతస్తుల కాంక్రీట్ భవనం సురక్షితమేనని భావించినప్పటికీ, పరిస్థితుల తీవ్రతను అర్థం చేసుకుని ఆయన తక్షణమే స్పందించారు.

 వెంటనే పాఠశాల గంట మోగించి తరగతి గదులను ఖాళీ చేయించడంతో పాటు బస్సులను సురక్షిత ప్రాంతాలకు మళ్లించారు. భయంతో స్పృహతప్పి పడిపోయిన ఒక విద్యార్థినిని బైక్‌పై పంపించి, మిగిలిన పిల్లలందరినీ ఎత్తైన కొండ ప్రాంతం వైపు పరుగులు తీయించారు. ఏ ఒక్క చిన్నారీ వెనుకబడిపోకుండా తనే అందరికంటే చివర్లో నడుస్తూ పర్యవేక్షించారు. పిల్లలంతా కొండపైన ఉన్న రావి చెట్టు వద్దకు చేరుకున్న కొద్ది నిమిషాల్లోనే ప్రళయంలా వచ్చిన వరద ప్రవాహం ఆ మూడు అంతస్తుల భవనాన్ని మట్టి, రాళ్లతో కప్పేసి పూర్తిగా తుడిచిపెట్టేసింది.

 ప్రిన్సిపాల్ చొరవతో 1,643మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడినప్పటికీ, ఆయనతో పాటు పనిచేసే ఇద్దరు సిబ్బందిని కాపాడుకోలేకపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఉదయం టిఫిన్ కోసం నది ఒడ్డున ఉన్న గదికి వెళ్లిన చరిత్ర ఉపాధ్యాయుడు సంతోష్ పరియార్(32), పాఠశాల తలుపులు వేయడానికి వెళ్లిన వాచ్‌మన్ సుల్తాన్ లామా ఈ వరద ప్రవాహంలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు దవాడీని దేవుడిలా కొనియాడుతుంటే, పిల్లల ప్రాణాలు కాపాడటం తన బాధ్యత మాత్రమేనని ఆయన నమ్రతతో తెలిపారు.

 నేపాల్-టిబెట్ సరిహద్దులోని లాంగ్‌టాంగ్ లిరుంగ్ శిఖరం వద్ద దాదాపు 50ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ మంచు, కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ప్రళయం సంభవించింది. 2015నాటి వినాశకర భూకంపం తరహాలోనే హిమాలయ ప్రాంతాల్లో సంభవించే ఆకస్మిక వరదలు ఎంతటి తీవ్ర ముప్పు కలిగిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. సరియైన సమయంలో తీసుకునే ఒక్క సాహసోపేత నిర్ణయం వేలాది ప్రాణాలను కాపాడగలదని రాజేంద్ర దవాడీ నిరూపించారు.

 

#NepalFloods#RajendraDawadi#HeroicRescue#NuwakotNepal#InternationalNewsTelugu#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి